Amman

Amman
Nitya subha mangalam

Tuesday, May 17, 2011

సురుటుపల్లి వైభవం




సురుటుపల్లి - ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూర్ జిల్లా లో ఉన్న చిన్న గ్రామం. దేవ దానవులు క్షీర సాగర మథనం చేసే సమయం లో హాహాహలం పుట్టి లోకాలన్నీ దహించుకు పోతున్న భయంకరమైన సమయం లో లోకాలన్నీ వెళ్లి పరమేశ్వరుడిని రక్షణ కోసం వేడుకున్నాయి. లోకాల రక్షణ కోసం ఆ విషాన్ని తాను సేవించడానికి సిద్ధ పడ్డాడు ఆ బంగారు తండ్రి. బిడ్డల రక్షణ కోసం ఎంత విపత్తు ని అయినా ఎదిరించడానికి సిద్ధ పడే ఆ తండ్రి ని జగన్మాత అనుసరించింది. కాలకూట విషం ఎంత భయంకరమైనది అయినా తన మాంగల్యం మీద తనకి ఉన్న నమ్మకం తో భర్త కి తన అంగీకారం తెలిపింది అమ్మవారు.

మనసే అసలు సిసలు మాంగల్యం - ఆమె మనసంతా ఆయనే నిండి ఉండగా - సాక్షాత్తు పసుపు కుంకుమ ల స్వరూపమైన అమ్మ వారికి తన మాంగల్యం మీద అంత నమ్మకం ఉండటం లో ఆశ్చర్యం ఏమీ లేదు.

స్వామి వారు హాలాహలాన్ని పుచ్చుకున్న కొద్ది సేపటి వరకు మైకం కమ్మేసింది. అప్పుడు అమ్మవారు పరుగున వెళ్లి అయ్య వారి తలని తన ఒడి లోకి తీసుకుని విశ్రాంతి గా శయనింప జేసింది. విషం స్వామి గొంతు దాటి కడుపు లోకి వెళ్తే అక్కడ ఉన్న లోకాలు దహించుకు పోతాయని గ్రహించి స్వామి వారి కంఠం దగ్గర చిన్న గా నొక్కి ఆ హాలాహలం అక్కడే ఉండి పోయేలా ఆపింది. స్వామి తేరుకుని అన్ని లోకాలు హాలాహలం నుంచి రక్షించ బడ్డాయని గ్రహించి నటరాజు గా అక్కడ ఆనంద తాండవం చేశారు. ఇంత అపురూపమైన ఘట్టానికి వేదిక సురుటుపల్లి.


తండ్రి శ్రీ రాముని మీద యుద్ధం చేసిన దోషం పోగొట్టు కోవడానికి లవ కుశులు ఇక్కడి పల్లి కొండీ శ్వర స్వామిని సేవించారు. వాల్మీకి మహా కవి రామాయణ రచన ప్రారంభించ బోయే ముందు ఈ స్వామి ని సేవించారు. స్వామి ని, అమ్మవారిని దర్శించుకునేందుకు ఆ నాడు అందరు దేవతలు భూమి మీద అడుగిడిన దివ్య స్థలం సురుటుపల్లి. అమ్మ సర్వ మంగళ ఒడిలో స్వామి శయనించి ఉండే ఏకైక మూల విరాట్టు సురుటుపల్లి లోనే ఉంది.


నిజానికి అమ్మ పార్వతి దగ్గర భక్తుడు చేసే ముదిగారం కన్నా, తండ్రి పరమ శివుడి పాదాల దగ్గర భక్తుడికి దొరికే కనికరం కన్నా ఈ అమృతం అంత ఘనమైనది ఏమీ కాదు. ఈ విషయాన్ని ఆ నాడు అందరు జ్ఞానులు ఎందుకు గమనించలేకపోయారు ? బహుశా ఈ రూపం లో పరమేశ్వర తత్వాన్ని, జగన్మాత మంగళ కరమైన స్వరూపాన్నిలోకానికి చాటి చెప్పే ప్రయత్నం చేశారేమో !

స్వామి దయ కి, అమ్మవారి ఆత్మ విశ్వాసానికి, ఆది దంపతుల అనురాగ పూరిత బంధానికి వేదిక గా నిలిచిన సురుటుపల్లి -సఖ్యత లేని దంపతుల ని, అనుకూలత లేని దాంపత్యాన్ని సరిదిద్ది - దర్శించిన దంపతులకి జన్మ జన్మ ల పాటు నిలిచే అన్యోన్యత ని ప్రసాదించే అపురూప క్షేత్రం. మైకం తో అలసి ఉన్న స్వామి అమ్మ వారి ఒడి లో పడుకుని ఉండగా, అమ్మవారి మంగళ సూత్రపు మంగళ కరమైన గల గలలు స్వామి కి అలసట తీర్చిన ఆ పుణ్య భూమి - భార్య భర్త ల అన్యోన్య అనురాగానికి, ఆదర్శ దాంపత్యానికి నిలువుటద్దం.

***********************************************

మంగళముకే మంగళం మా సర్వ మంగళ
నిఖిలమై నిలిచినట్టి నిత్య సత్యపు కళ
శివమే సూత్రమైన తాళిబొట్టు చలువల
ఈశుతల వాల్చినాడు ఆమె ఒడి కోవెల

పార్వతమ్మ కనులలో ముదిగారాల కన్నా
శంకరయ్య పదము లందు కనికారాల కన్నా
ఏమిటంత ఘనమంట అమృతపు భోగమంట
పాల సంద్రము చిలికి పుట్టించే గరళ మంట
నిప్పుతో చెలగాటకు నిక్కుతున్న బిడ్డలను
కరుణ జూచి కమలాక్షి కాచుకొన వచ్చెను


మేలిమి మనసే మరి - సిసలు మాంగల్యము
అది యంత నిండెను పరమేశు ధ్యానము
ఎంత గా మది నమ్మెను నా తల్లి పార్వతి
పసుపు కుంకుమ రూపు పరమేశు ప్రియ సతి
మంచు కొండ సామి మింగే కాలకూట గరళము
చలువ పొంది సేద దీరె లోకమందు జీవము

మైకమే కమ్మినది మా దొడ్డ సామి కి
ఒడి చేర్చి లాలించే బంగారు నాయకి
కడుపు లో లోకాలు దాచుకున్న అయ్యని
నీల కంఠం జేసే అమ్మ నారాయణి
ఎంత ఎంత జెప్పుదును అమ్మ అయ్య ల దయను
సురుటుపల్లి సీమ లోని కడుపు చలువ కథలను