Amman

Amman
Nitya subha mangalam

Monday, October 8, 2012

తమాసోమా జ్యోతిర్గమయా

ప్రతి మనిషికీ తనది అయిన ఒక ఆలోచనా ధోరణి ఉంటుంది. తనది అయిన ఒక సంస్కారం ఉంటుంది. దానిని బట్టే ఆ వ్యక్తి మంచి చెడులు భావన చేస్తూ ఉంటాడు.

ఏ ఇద్దరు వ్యక్తుల విలువలూ ఒకేలా ఉండవు. ఇక్కడే విపరీతమైన ఘర్షణ మొదలవుతుంది. ఈ ఘర్షణ పెరిగి పెరిగి - ఒక వ్యక్తి మంచి ఇంకొక వ్యక్తి చెడు గా మారే స్థాయి కి చేరుతుంది.

కానీ మనుషుల వ్యక్తిగత ఇష్టాలు అయిష్టాల కన్నా ఉన్నతమైన స్థాయి లో, మనిషి జీవితం ఎలా ఉండాలి, సంబంధాలు ఎలా ఉండాలి, సాంఘిక జీవితం ఎలా ఉండాలి, రాజ్యం ఎలా ఉండాలి - ఈ విషయాలు అన్నీ వాటికి కావాల్సిన విజ్ఞానం తో సహా మన వేదాల్లో పొందు పరచబడ్డాయి - మతాలకు, ధర్మాలకు అతీతంగా.  అతి సమస్యాత్మక సందర్భాలలో కూడా విజ్ఞతతో ఎలా ముందుకు వెళ్ళాలో స్పష్టం గా వేదాలలో చెప్పబడింది.

ఈ విశ్వం లో పుట్టిన ప్రతి  జీవి సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించడానికి, తన జీవిత పరమార్ధాన్ని తెలుసుకోవడానికి, పరమాత్మ ని చేరుకోవడానికి కావాల్సిన అన్ని వనరులని ప్రకృతి ఆ జీవి పుట్టిన నాడే సిద్ధం చేసి ఉంచుతుందట ! జీవికి - ముఖ్యం గా మనిషి కి పరమాత్మ దత్తమైన స్వేచ్ఛ ఉంటుంది. దానిని ఆ వ్యక్తి ఎంత సద్వినియోగం చేసుకుంటాడు అన్న విషయం మీదే ఆ వ్యక్తి చైతన్య స్థాయి ఏర్పడి ఉంటుంది. ఆ చైతన్య స్థాయి ని బట్టి ఆ మనిషి ఆలోచన, ప్రవర్తన ఉంటాయి. వ్యక్తుల లోని ఈ చైతన్య స్థాయిలలో తేడాలు, ఆ తేడాలని అంగీకరించలేని వ్యక్తులు - ఈ ప్రపంచం లోని అన్ని సంఘర్షణలకు, ఘర్షణలకు కారణం. 

నేటి కాలం లో ప్రతి మనిషి మనిషి కీ మధ్య పెద్ద పెద్ద అడ్డు గోడలు; ప్రేమ, అభిమానం పంచుకోవడానికి వీలు లేనంత మందమైన అడ్డు గోడలు. ఆహారం లో మార్పు, జీవన విధానం లో మార్పు, సాంఘిక జీవనం లో మార్పు, కుటుంబ జీవనం లో మార్పు. అన్ని రకాల రుగ్మతలకి మందు లా పని చేసే ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని మన చేతులతో మనమే నాశనం చేసుకున్నాం. చిన్న పిల్లలని సంరక్షణా కేంద్రాల పాలు చేశాము, పెద్ద వాళ్ళని వృద్ధాశ్రమాల పాలు చేశాము,  వైవాహిక జీవన ఔన్నత్యాన్ని ఒత్తిళ్ళు అహంకారాల కింద ఉంచేశాము, అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములను పిలుపుకి అందనంత దూరం లో పెట్టాము, భగవంతుడి దగ్గర సహేతుకం కాని కాని కోరికలకి కూడా బేరం పెట్టాలని చూశాము - మొత్తం గా ధార్మికం గా పేదరికం అనుభవిస్తున్నాం. మనిషి ని దైవ స్వరూపం గా మార్చే సుగుణాలు - ప్రేమ, దయ, కరుణ, క్షమ  - అన్నీ వదిలి బ్రతుకుతున్నాము.

క్షమ - ఉత్కృష్టమైన సుగుణం. మన భారతీయ ఆధ్యాత్మిక జీవనానికి ఆభరణం. క్షమ లేని ఆధ్యాత్మిక సాధన జీవం లేని శరీరం లాంటిది.

అలాగే ఆధ్యాత్మిక జీవనం కుటుంబ, సాంఘిక జీవనాలకు భిన్నమైనది కాదు - అది వాటితో మమేకమయ్యే అంతర్లీన ప్రవాహం.


ఆధ్యాత్మిక సాధన అనేది జీవితం లో అన్ని దశలు దాటిన తర్వాత ఆలోచించాల్సిన దశ కాదు. మనిషి పుట్టుక నుంచీ జీవితపు చివరి క్షణం దాకా ప్రతి దశ లోనూ మార్గదర్శకం గా నిలిచే జ్ఞానం అది. ఈ విషయాన్ని అర్థంచేసుకోవడం లో నేటి మనుషులు విఫలం అవుతున్నారు. వారు జీవితాన్ని దిద్దుకోలేక, తరువాత తరాలకు ఆ జ్ఞానాన్ని, వారసత్వాన్ని అందించలేక - పొరపాటు మీద పొరపాటు చేస్తున్నారు.

అందుకే నేటి మనిషి క్రూరం గా మారిపోయాడు. తన ఇష్టానికి వ్యతిరేకం గా జరిగే దేనినీ తట్టుకోలేనంత అసహనం పెరిగింది. తన చుట్టూ ఇనుప గోడలు కట్టుకుంటున్నాడు. త్యాగం లో ఉండే ఆనందం పూర్తిగా మర్చిపోయాడు. తనకి అనుకూలం గా లేని మనుషుల మీద, పరిస్థితుల మీద అంతు లేని ద్వేషాన్ని పెంచుకుంటున్నాడు, ఆ ద్వేషమే శ్వాస లాగ బ్రతుకుతున్నాడు. దైవంతో తనకున్న అత్యున్నతమైన బంధాన్ని పదిల పరుచుకునే అవకాశాలని విస్మరిస్తున్నాడు. ఆత్మోన్నతి కోసం సాధన చెయ్యాల్సిన అవసరాన్ని మరచిపోతున్నాడు. ఒక్క మాటలో - మనిషి మనిషిలా బ్రతకడం లేదు.

ఎదుటి వారి ప్రవర్తన మనలని బాధ పెడితే స్పష్టం గా చెప్పాలి... మన వైపు నుంచి ఏమన్నా పొరపాటు ఉంటే మనను మనం దిద్దుకోవాలి. మంచి ని మంచి గా ఆదరించాలి, చెడు ని వ్యతిరేకించాలి, కాని ఆ వ్యతిరేకించడం లో క్రూరత్వం ఉండకుండా ప్రవర్తించాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా మారలేని మనుషులను ద్వేషించకుండా, ఆ మనుషుల చైతన్య స్థాయిలను మనం అర్థం చేసుకోవాలి. వారికి మేలు జరగాలని, మానసికం గా పరిణితి చెందాలని దేవుడిని స్వచ్చమైన మనసుతో ప్రార్థించాలి.


తల్లికి అందరు బిడ్డలు సమానం అయినా కూడా, ఏదైనా లోపం ఉన్న బిడ్డని ఎక్కువ గా ఆదరించినట్టు - అజ్ఞానం వలన మనలను బాధించే వారు ఆ అజ్ఞానం నుంచి బయట పడాలని వారి కోసం మనం ఎక్కువ గా ప్రార్థించాలి.
మన జీవితం అంటే కేవలం మనమే కాదు, మన చుట్టూ ఉన్న అన్ని మంచి చెడుల కలయిక. 

ఇది అంతా ఒక విషయం లాగ చెప్పుకోవడానికి బాగుంటుంది కాని దీన్ని ఆచరించి చూపించడం చాలా చాలా కష్టం. ముఖ్యం గా మన సాత్విక ఆలోచనని ఎదుటి మనిషి అశక్తత గానో, అనివార్యం గానో భావిస్తే మన సహనానికి అది నిజమైన పరీక్ష అవుతుంది. ఆత్మ రక్షణ కి, ఆత్మ విశ్వాసానికి ఉన్న అంతరం చాల చిన్నది, సన్నది. సరి అయిన సమయం లో, సరి అయిన తీరులో, సరి అయిన దృక్పధం తో ముందుకు వెళ్ళడం అనేది సామాన్యమైన విషయం కాదు, చాలా చాలా సాధన కావాలి, పరిణితి కావాలి, ఓర్పు కావాలి; అన్నిటి కన్నా ఎక్కువ గా మనస్సు ని, శరీరాన్ని, ఆత్మ ని సంయమనం తో ముందుకి నడపడానికి దైవ బలంకావాలి.

పరమేశ్వరా ! ఆ బుద్ది నీ, పరిణితి నీ,విచక్షణ నీ అందరికీ ప్రసాదించు.

ద్వేషాన్ని ప్రేమ తోనూ, చీకటి ని వెలుగు తోనూ, అజ్ఞానాన్ని జ్ఞాన జ్యోతి తోనూ జయించగల సాధన ని ప్రసాదించు.

అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ ...