అమ్మ వారి దర్శనం కోసం నేను వెళ్తే అమ్మ నన్ను గర్భ గుడి దాక రప్పించుకుని నా కన్నుల నిండు గా నాకు దర్శనం ఇచ్చింది. ఒక్క సారి గా కాలం ఆగి పోతే బావుండు అనిపించింది. కను రెప్ప వేస్తే ఆ కొద్ది కాలం కూడా కామాక్షి అమ్మ ని దర్శనం చేసుకునే భాగ్యం పోతుందేమో అనిపించింది. ఆనందం తో బరువెక్కిన గుండె, అమ్మ చిరు నవ్వుల కాంతి పరుచుకున్న పరిసరాలు నా కళ్ళకి పొరలాగా కమ్మి నేను ఎక్కువ సేపు అమ్మని చూడలేక పోతున్నాను అనే బాధ కి గురి చేశాయి.
అమ్మ వారిని కనుల నిండుగా అక్కడ దర్శించి ఆ రూపమే నాలో నింపుకుని ఇంటికి వెళ్ళాలి అనుకున్నాను. కాని చరా చార జగత్తు అంతా నిండిన అమ్మ సంపూర్ణ స్వరూపాన్ని నా ఆత్మ గ్రహించడానికి నాకు ఇంకా పరి పక్వత రావాలని అర్థం అయ్యింది. అక్కడ అమ్మని అర్చించే పసుపు కుంకుమ ల లో కామాక్షి, పువ్వులలో కామాక్షి, ఫలము లలో కామాక్షి, అగరు గంధాలలో కామాక్షి, నేతి దీపాలలో కామాక్షి, పూల దండలలో కామాక్షి - అసలు విశ్వము, జీవమే ఆమె అయినప్పుడు అక్కడ అన్నిటిలో అమ్మ కనిపించడం లో ఆశ్చర్యం ఏముంది ?
అమ్మ దగ్గర గా కొంత సమయం గడిపాక కుంకుమ పూజ అయ్యాక అమ్మ దండలలో ఒకటి నాకు ప్రసాదం గా ఇచ్చారు. మల్లెలు, జాజులు, గులాబీలు, తామర లు, తులసి దళాలు, మొగలి రేకులు అన్ని కలిసి ఉన్న ఆ దండ నుంచి ఈ పువ్వులవి ఏవీ కాని ఒక గొప్ప సుగంధం వస్తోంది. అది జన్మ జన్మల దుఖాన్ని పోగొట్టే అద్భుత సుగంధం. ఈ సృష్టి లోని సుగంధ భరిత విషయాలు అన్నీఅమ్మ వారి సిగ నుంచి సుగంధాన్ని అరువు తెచ్చుకున్నవే కదా !
ఆ క్షణం అమ్మ ని ఇది కావాలి అని ఏదీ కోరుకోవాలని అనిపించలేదు. అన్నిటి కన్నా గొప్ప కానుక అమ్మ సాన్నిధ్యం - దానిని అమ్మ నాకు ఇస్తే ఇంకా ఏమి కావాలని నేను అడగాలి ? నా ఆత్మ, మనసు, శరీరం ఆ క్షణం లో పొందిన అనుభూతి ని చెప్పడానికి భాష చాలదు కాని కొంత అయినా నా భాష లో చెప్పగలను అనిపించి రాసుకున్న పాట ఇది -
రెప్ప వేయ కంటికి - ఒప్ప దాయె మనసు కి
జన్మ లన్ని వేచి వేచి చేరినాను కంచికి
అమ్మ ఒడి చేరి కనుల నీళ్ళు చిప్పరిల్లగా
అంబ కామాక్షి నగవు వెలుగు విర జిమ్మగా
కన్నులే వెలుగులయ్యి కాన లేక పోతిని
నిన్ను గాంచి కనుల లోన నింపుకొన కోరితిని
నిత్యమైన సత్తెమల్లె నిలుపుకొన చూచితిని
దిగులు బాపి కుదురు తెచ్చి ఊరడించి మనసుని
ఒడి ని లాలించితివి నన్ను దరి చేర్చుకుని
మరువము మల్లెలు మొగలి పూరేకులు
కలువలు తామరలు కృష్ణ తులసి మాలలు
అమ్మ నగవు సొగసు ను అనువుగా (అణువుగా) పొందినవి
అమ్మ సిగ న సుగంధమే అరువు తెచ్చుకున్నవి