Amman

Amman
Nitya subha mangalam

Monday, March 7, 2011

మా బంగారు తల్లి కామాక్షి

ఈ భూ మండలానికి నాభి స్థానం కాంచీపురం.

జగన్మాత తన బిడ్డలని ఉద్ధరించడానికి వేంచేసిన అతి పవిత్రమైన స్థలం కాంచీపురం.

ఒక రోజు పార్వతి అమ్మవారు ఈశ్వరుడిని ఆట పట్టించాలని వెనుక వైపు నుంచి ఆయన రెండు కళ్ళని మూసి వేశారట. ఆయన రెండు కన్నులు సూర్య చంద్రులు (మూడవ కన్ను అగ్ని). సూర్య చంద్రులు లేక లోకం అల్లాడిందట. అప్పుడు అమ్మ వారికి పాపం చుట్టుకున్నదట. పాప విముక్తి కోసం తను ఏమి చెయ్యాలో అమ్మవారు స్వామి ని అడుగగా ఆయన భూలోకం లో కంచి కి వెళ్లి తపస్సు చేసి పాపం హరించు కోమని, అప్పుడు తను వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పారట.

అమ్మవారు కాత్యాయని గా ఇక్కడ కంచి లోని ఒక మామిడి చెట్టు కింద ఇసుక తో లింగాన్ని చేసి తపస్సు మొదలు పెట్టారట. ఈశ్వరుడు అమ్మ వారి తపస్సు ని పరీక్షించాలని సంకల్పించి గంగా దేవి ని ఆ తపస్సు చేసుకుంటున్న ప్రాంతం వైపు ఉద్ధృతం గా ప్రవహిస్తూ వెళ్ళమని చెప్పారట. వేగం గా వస్తున్న గంగ ని పార్వతి అమ్మవారు ఒక కమండలం లోకి పంపి ప్రవాహాన్ని ఆపి వేశారట. ఈశ్వరుడు కొంచెం పట్టుదల గా ఇంకొక ప్రవాహాన్ని సృష్టించి అమ్మవారు తపస్సు చేస్తున్న ఆశ్రమం వైపు పంపారట. అమ్మ తన అన్న అయిన విష్ణు మూర్తిని ప్రార్ధన చేస్తే, ఆయన చెల్లెలికి ఆవిడ పూజిస్తున్న సైకత శివ లింగాన్ని గట్టి గా కౌగలించుకుని ఈశ్వరుడి ని తలుచుకొమ్మని చెప్పారట. ఆవిడ అలాగే శివ లింగాన్ని కౌగిలించుకునే సరికి ఈశ్వరుడి కి ఆమె స్పర్శ కి పులకింత కలిగి ఒక్క సారి గా పట్టుదల పోయి ఆమె మీద అనురాగం మొదలయ్యింది. ఆ సైకత లింగం మీద ఇప్పటికీ అమ్మవారి నగలు, ఇతర ఆభరణాల గుర్తు లు స్పష్టం గా ఉంటాయట... అందరి మనసు లలో అనేక వికారాల ను కలిగించే మన్మథుడి కి ఈశ్వరుడు వశంకాలేదు కాని, జగత్తు కి తండ్రి అయిన ధీరోదాత్తుడు ఈశ్వరుడు జగన్మాత స్పర్శ కి అనురాగ పూరితుడు కాకుండా ఎలా ఉంటాడు ? వారిది - వాక్కు కి, అర్థానికి ఉన్న అవినాభావ సంబంధం లాంటి అద్భుతమైన బంధం.
ఆ కళ్యాణమే ఈ విశ్వ కళ్యాణ కారకం గా ఏకామ్రనాథుని కామాక్షి అమ్మ వారిని కంచి లో కొలువు తీరేలాచేసింది. అదే కంచి క్షేత్ర వైభవం.

సాక్షాత్తు విశ్వానికి జ్ఞానాన్ని ప్రసాదించే ప్రసన్న అయిన అమ్మ వారు ఎందుకు అయ్య వారి కన్నులు మూసి పాపాన్ని పొందారు ? ఆ రూపం లో భూమి మీదకి వచ్చి కంచి క్షేత్రం లో వెలసి తన కోసం అయ్య వారిని కూడా రప్పించి ఇక్కడ భూమి మీద ఉన్న ప్రజలకి పాప విముక్తి చెయ్యడానికి అమ్మ అనంతమైన కరుణ తో మన కోసం తను పాపాన్ని మోసింది. అమ్మ ఎప్పటికీ అమృత స్వరూపమే. బిడ్డల క్షేమమే అమ్మ పరమ లక్ష్యం.

ఎక్కడ శివ పార్వతుల కళ్యాణం జరుగుతుందో ఆ ప్రదేశం సుభిక్షం గా ఉంటూ పావన కరమై లోకానికి మేలు చేస్తుంది. ఈ విశ్వానికి ఆ మేలు చెయ్యడం కోసమే అమ్మవారు కంచి లో స్వామి వారితో సహా వెలసి ఉన్నారు.

ప్రాపంచికమైన ఎన్నో విషయాలలో నిత్యం కొట్టు మిట్టాడుతూ తెలిసి కొన్ని, తెలియక కొన్ని పాపాలు చేస్తూ నిత్య సంఘర్షణ మయం అయిన జీవితాలు గడిపే ప్రజలకి - గోరంత ఆశించి వచ్చి నమ్మకం తో తన దగ్గర ఉన్న బిడ్డలకి - కొండంత అనుగ్రహం ఇవ్వడమే ఆ అమ్మ తత్వం. ఆ కామాక్షి అమ్మ అనుగ్రహాన్ని కొండంత అనుభవిస్తున్న నేను అమ్మని చూసిన మరు క్షణం నుంచి నాలో పొంగిన సంతోష తరంగాలని మాటలలో పెట్టడానికి ప్రయత్నించాను. 'శేష శైల వాస శ్రీ వేంకటేశా' అని ప్రతి తెలుగు వాడు అనుభూతిస్తూ పాడుకునే రాగం లోనే నేను కూడా అమ్మ కామాక్షి అనంత కరుణా రస సారాన్ని ఇలా రాసుకున్నాను - అదే రాగం లో ...

కనులార కాంచితిని కామాక్షి తాయి
కాంచీ పురమంత విచ్చె నా కను దోయి

వేడి చలువల విధి ని
జగతికి హిత మిచ్చు
సూర్య చంద్రులు ఎవరు
ఈశు కన్నులు కారె ?
సరస సల్లాపమున ఈశు కన్నులు మూసి
పాపాలు పొందె నట పార్వతీ పావని

అమ్మ ఒడి లాలించ
అయ్య ఒడి పాలించ
లోకాల దీవించ
కంచి కి ఏతెంచ
పాపము ను తను మోసి తపము కై అరుదెంచి
ఉర్వి బిడ్డల సాకె కమలాక్షి కామాక్షి

నిఖిల లోకము లంత
నిజమైన జ్ఞానమై
బుద్ధి వెలుగుల నిచ్చు
శ్రీ ప్రసూనాంబయె !
ఏకామ్ర నాథుని తపము తో వరియించి
కళ్యాణి అయి లోక కళ్యాణ మొనరించె

గంగయే పొంగ గా
ప్రళయమై పొరలగా
ఆలింగనము తోటి
ఈశు ఒడలంత గుచ్చె !
నవనీత చోరుని చెల్లాయి నా యమ్మ
చూపు వెన్న ల తోటి స్వామి నే మురిపించె / చూపు వెన్నల తోటి గాయమే మాన్పింప

No comments:

Post a Comment