దాక్షారామం ...
పంచారామ లింగం, శక్తి పీఠ క్షేత్రం. ఆది దంపతులకి అత్యంత ఇష్టమైన క్షేత్రాలలో (కాశి, శ్రీకాళహస్తి, శ్రీశైలం, ఉజ్జయిని, కాంచీపురం క్షేత్రాల కోవలో) ఇది కూడా ఒకటి. అష్టాదశ శక్తిపీఠ ఆవిర్భావ కథకి వేదిక దాక్షారామం. దక్షుడు యజ్ఞం చేసిన భూమి ఇది.
యజ్ఞంలో పరమశివుడికి హవిస్సు ఇవ్వకుండా చేయ తలపెట్టిన దక్షుడి అహంకారం సమూలంగా తీసివేయబడ్డ భూమి ఇది. శివుడు - అంటే అర్థం శుభం కలిగించే వాడు. శివ దర్శనం శుభకరం, శివ నామ స్మరణ శుభకరం, శివ పూజ శుభకరం, శివ అభిషేకం శుభకరం.
"శివుడు లేకుండా తలపెట్టిన ఎంత గొప్ప పని అయినా దానికి శుభం లేదు" అని పార్వతీ మాత లోకానికి తెలియజెప్పడానికి 'దాక్షాయణి'గా తన శరీరాన్ని విడిచిపెట్టిన స్థలం దాక్షారామం.
ఇది మాత్రమే కాదు, దాక్షారామం సామాన్య మానవాళికి ఇచ్చే సందేశాలు ఎన్నో -
1) మన దీక్ష ఫలితంగా భగవంతుడు మనని కరుణిస్తే, మరింత జాగరూకతతో వినయంగా వ్యవహరించాలి. ఒక సారి పరమాత్మ దయ వల్ల మనకి జరిగిన మంచిని మన గొప్పతనం అనుకోవడం మొదలుపెడితే పతనం అక్కడే మొదలవుతుంది.
దక్షుడు మొదట ప్రజాపతి అని గర్వించాడు. తన తపోఫలంగా అమ్మవారిని కుమార్తెగా పొందాక ఆమెకి తండ్రిగా సర్వాధికారం తనదే అన్నట్టు ప్రవర్తించాడు. అకారణంగా అల్లుడి వ్యక్తిత్వం గుర్తించక ద్వేషం పెంచుకున్నాడు. అహంకారంతో గౌరవనీయమైన వారిని అవమానించబోయాడు.
2) పరమాత్మకి వ్యతిరేకంగా, అహంకారంతో ప్రవర్తించిన వారికి నాశనం తప్పదు.
3) భార్యకి భర్త పట్ల ఉండాల్సిన ప్రేమని, గౌరవాన్ని పార్వతీదేవి సతీ దేవి రూపంలో చూపించింది.
4) భర్త భార్య పట్ల ఎంత అనురాగంతో ఉండాలో, దంపతులు ఒకరి ప్రాణం ఒకరుగా ఎలా ఉండాలో స్వామి చూపించారు.
కాశీలో సహజ మరణం పొందే వారికి అంత్య కాలంలో, సాక్షాత్ పరమశివుడు చెవిలో ప్రణవ మంత్రాన్ని వినిపించి విశాలాక్షీ గణపతి దేవుల సాక్షిగా తనలో కలిపేసుకుంటాడని సనాతనుల విశ్వాసం. తిరిగి భూమండలం మీద అలా సహజ మరణం పొందే సమయంలో, పరమశివుడు స్వయం గా వచ్చి మంత్రోపదేశం చేసే ఏకైక క్షేత్రం ఒక్క దాక్షారామం మాత్రమే అని అంటారు. జీవుడి శరీరం పడిపోయే సమయంలో దాక్షారామంలో, అమ్మ మాణిక్యాంబ వచ్చి తన ఒడిలో బిడ్డను పడుకోబెట్టుకుని గాలి విసురుతూ ఉంటే, భీమేశ్వరుడు ప్రణవ మంత్రాన్ని ఉపదేశం చేస్తారట.
దాక్షారామం వద్ద సప్త గోదావరుల సంగమ తీర్థం వద్ద ఉంది. సప్త గోదావరులు అంతర్వాహినులుగా వచ్చి ఆ తీర్థంలో కలుస్తాయి. దాక్షారామం చుట్టు పక్కల అంతా సుభిక్షమైన భూమి, పచ్చని వరి పొలాలతో అన్నపూర్ణగా వర్ధిల్లుతున్న భూమి. సామర్లకోట భీమేశ్వర స్వామి లాగ దాక్షారామ స్వామి కూడా రెండు అంతస్తులలో ఉంటారు. కింద పానపట్టం, శివ లింగంలో కొంత భాగం దర్శనం ఇస్తాయి. అభిషేకాదులు చెయ్యాల్సిన లింగం పై భాగం రెండో అంతస్తులో ఉంటుంది. ఈ క్షేత్రానికి పాలకుడు లక్ష్మీ నారాయణ స్వామి. గుడి లోపలి ప్రాకారం లో అడుగు పెట్టిన వెంటనే కుడి పక్కన లక్ష్మీ నారాయణ స్వామి ఉంటారు. దాక్షారామంలో విశేషం ఏమిటంటే, ఎప్పుడు మాణిక్యాంబ భీమేశ్వర స్వామి కల్యాణం చేసినా, అదే పందిరిలో శ్రీ లక్ష్మీ నారాయణుల కల్యాణం కూడా కలిపి చేస్తారు. ఇద్దరు ఆది దంపతుల కళ్యాణాలు ఒకే పందిరిలో జరుపుతారు - ఇంక ఆ ప్రాంతం సుభిక్షంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు.
కింద అంతస్తులో స్వామి లింగానికి ప్రదక్షిణ చేసే మార్గం ఉంటుంది, అంతా చిమ్మ చీకటి గా ఉంటుంది. అక్కడ రాతి గోడల మీద బొడిపెలు ఉంటాయి. పూర్వం అక్కడ వజ్రాలు ధగ ధగ మెరుస్తూ ఉండేవట. వాటి కాంతులలోనే భక్తులు ప్రదక్షిణ చేసేవారట. ఒక కాలంలో దొంగలు ఆ వజ్రాలు దొంగిలించే ప్రయత్నం చెయ్యగా మాణిక్యాంబ అమ్మవారి ఆగ్రహం తో వాళ్ళు శిలలు అయ్యారని, అప్పటి నుంచి వజ్రాలు రాళ్ళు అయ్యాయని చెప్తారు. దాక్షారామ ఆలయం ఒక రాత్రి లో దేవతలు కట్టారని, సుర్యోదయంలోపు పై కప్పులో ఒక చిన్న భాగం పూర్తి చెయ్యలేక వదిలేశారని అంటారు. పై అంతస్తులో స్వామి వారికి ప్రదక్షిణ చేస్తుంటే ఈ అసంపూర్ణం గా వదిలేసిన కప్పు రంధ్రం కనిపిస్తుంది. అక్కడ నుంచి స్వామి ఆలయ శిఖరం చూడడం గొప్ప అనుభూతి. సామర్లకోట స్వామి లాగే దాక్షారంలో కూడా స్వామి తెల్లని స్ఫటిక లింగం. పంచామృత అభిషేకం, సుగంధ ద్రవ్యాల అభిషేకం, పుష్పాలంకారం అన్నీ అత్యద్భుతంగా ఉంటాయి.
దాక్షారామంలో ఉన్న విశేషం ఏమిటంటే గర్భ గుడిలో స్వామి పక్కనే, సతీదేవి విగ్రహం ఉంటుంది. భర్త పట్ల అవ్యాజమైన అనురాగం కల బంగారు తల్లి మా దాక్షాయణి, భర్త గౌరవమే తన ఆభరణంగా మెలిగిన మహా పతివ్రత నా తల్లి దాక్షాయణి.
స్వామి గుడి మెట్లు దిగి వెనుక భాగంలో ఉన్న మండపానికి వెళ్తే అక్కడే శక్తి పీఠ అధినేత్రి మాణిక్యాంబ అమ్మవారు కొలువై ఉంటారు. అమ్మ మూర్తి బహు తేజోమయంగా ఉంటుంది. నాలుగేళ్ల పసి బిడ్డ నగుమోముతో మనం ముందు కూర్చున్నట్టు ఉంటుంది.
మా నాన్నగారు, పెదనాన్న గారు స్వయంగా స్వామి కి అభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజ చేసుకునే అదృష్టాన్ని పొందారు. ఆ రోజు దాక్షారామం లో దిగిన దగ్గర నుంచి తిరిగి దాక్షారామం వదిలి వచ్చే వరకు, సన్నని తుంపర మమ్మల్ని తాకుతూనే ఉంది. నిరంతరం స్వామి ఝటాఝూటంలో పొందికగా ఒదిగి ఉండే ఆకాశ గంగమ్మ, స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చిన మమ్మల్ని ఆనందంతో ఆహ్వానిస్తూ, ఆశీర్వదిస్తున్నట్టు నాకు తోచింది. చుట్టూ రెండు ప్రాకారాల మధ్యలో ఠీవిగా నిలబడ్డ అతి విశాలమైన దాక్షారామ ఆలయం, ఉపాలయాలు, అక్కడ నేల, చెట్టు చేమలు, పుట్టలు, శిల్పాలు, రాళ్ళు రప్పలు - అన్నిటినీ అభిషేకిస్తోంది ఆకాశ గంగమ్మ, మాతోపాటుగా. ఆ క్షణం నా చుట్టు పక్కల అన్నిటిలో మాత్రమే కాదు, నా లోపల కూడా పరమ శివుడే ఉన్న భావన... అణువు అణువునా ఉన్న పరమశివుడికి జలాభిషేకం జరుగుతోంది అక్కడ.
లోపల ప్రాకారం నుంచి మొదటి ప్రాకారం మధ్యలో ఉన్న అశ్వత్థ నారాయణ వృక్షం దగ్గరకు వచ్చాము. భీమేశ్వర స్వామి గర్భ గుడి నుంచి బయటకు వచ్చి రెండు ప్రాకారాల తలుపులు దాటి సప్త గోదావరీ తీర్థానికి వెళ్ళే మార్గం లో - రెండు ప్రాకారాల నడుమ వున్న అతి విశాలమైన ప్రాంగణంలో - ఈ వృక్షం ఉంది, ఆ వృక్షం మొదలులో శివ నారాయణుల మూర్తులు ఉన్నాయి. వృక్షం మొదలులో చుట్టూ అనేక నాగ శిలలు ప్రతిష్ట చేసి ఉన్నాయి. సప్త గోదావరీ తీర్థం లో ఉన్న నీటితో శివ కేశవులని అభిషేకించడం అత్యంత పుణ్య దాయకం. తీర్థం నుంచి అభిషేకానికి నీరు తీసుకు వస్తుంటే,ఒడ్డున ఉన్న ఒక మంటపంలో, అతి నిరాడంబరంగా సాదాసీదాగా ఉన్న ఆహార్యంతో ఒక తల్లి చేతిలో లలితా సహస్ర నామ పుస్తకంతో ధ్యానం చేసుకోవడం గమనించాను. ఇంటిలో లౌకిక వ్యాపారం ముగించి వచ్చి, అమ్మవారి ధ్యానం చేసుకుంటున్నట్టుగా ఉంది ఆ తల్లి. ఆమెను అర గంట క్రితం మాణిక్యాంబ అమ్మవారి గుడిలో స్తంభానికి చేరగిలబడి, చుట్టూ పరిసరాలతో సంబంధం చేకుండా సాధన చేస్తూ ఉండగా చూశాను. ఎందుకో ఆ తల్లిని చూడగానే హిమాలయాలలో ఏకాగ్ర చిత్తంతో తపస్సు చేసుకునే మహర్షులు గుర్తుకు వచ్చారు.
అశ్వత్థ నారాయణ వృక్షం నుంచి కాల భైరవ స్వామి గుడికి వెళ్లి ఆయనను దర్శించుకోగానే, అమ్మ మాణిక్యాంబ గుడి ప్రాంగణం లో జరుగుతున్న అన్నదానంలో మాకు ఆప్యాయంగా ప్రేమగా భోజనం తినిపించింది. ఎక్కడ అన్నదానం జరుగుతుందో, అక్కడ శాంతి ఉంటుంది. ఎవరన్నా ఎక్కడన్నా అన్నదానంలో తినడానికి కూర్చున్నప్పుడు చెయ్యాల్సిన మొదటి పని -
"అన్నపూర్ణే ! సదా పూర్ణే ! శంకర ప్రాణ వల్లభే
జ్ఞాన వైరాగ్య సిద్ద్యర్థం భిక్షామ్దేహిచ పార్వతీ
మాతా చ పార్వతీ దేవీ పితాదేవో మహేశ్వరః
బాన్ధవాః శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్"
కడుపు నిండా తిని లేచాక చెయ్యాల్సిన మొదటి పని -
"అన్నదాతా సుఖీభవ ! అన్నదాతా సుఖీభవ ! అన్నదాతా సుఖీభవ !"
మన క్షేత్రాలలో నిత్య అన్నదానాన్ని మొదలుపెట్టి నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న యజ్ఞంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరికీ శుభం కలుగుగాక !
దాక్షారం గుడిలో దర్శనం అయ్యాక బయటకు వచ్చిన వెంటనే ఎడమ పక్కన సప్త గోదావరీ తీర్థం ఒడ్డున ఒక పురాతన ఆలయం ఉంది. అక్కడ పరమేశ్వరుడు సర్వమంగళా దేవి సమేతం గా కొలువై ఉన్నాడు. మెడలో ప్రస్ఫుటం గా కనిపించే మంగళ సూత్రాలతో స్వామి పక్కన కూర్చుని ఉన్న మా సర్వ మంగళాదేవిని - మంగళములకే మంగళము అయిన మా తల్లిని - చూడగానే లోలోపల ఇది అని చెప్పలేని ఒక పులకరింత, కళ్ళలోనూ - మనసులోనూ - దేహం లోనూ - ఆలోచనలోనూ ఏదో సంతృప్తి.
అక్కడ నుంచి నేను ఎన్నో రోజుల నుంచీ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న దక్ష గుండానికి వెళ్ళాము. గుడికి ఫర్లాంగు దూరంలో, కోటిపల్లి రోడ్డులో విజయా సినిమా హాలు పక్కన, పెద్దగా దృష్టికి అందని ఒక తోటలో ఉంది ఈ దక్ష గుండం. గేటు నుంచి లోపల ఇరుకైన దారిలో ఒక పావు కిలోమీటరు నడిస్తే, చెట్టు చేమలు నీటి ధారల మధ్య ఒక ఆలయం, పక్కన చిన్న కొలను ఉన్నాయి.
ఆ కొలను ఒకప్పుడు దక్ష యజ్ఞం జరిగిన దక్ష గుండం. కిందకి మెట్లు దిగి కొలను ఒడ్డుకి వెళ్లాను. కొలను మధ్యలో దాక్షాయణి విగ్రహం నిలిపిన చిన్న మందిరం ఉంది. కొలను ఒడ్డు నుంచి మందిరానికి చిన్న చెక్క బల్ల వేశారు. దాని మీద నడిచి వెళ్లి దాక్షాయణి అమ్మ పాదాలకి మొక్కాను. తిరిగి వెనక్కి వచ్చేశాను. ఒక్క సారి వెనక్కి తిరిగి చూశాను. శరీరం అంతా విద్యుత్తు పాకిన అనుభూతి. ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి ... ఇది బాధా, సంతోషమా ? గొప్ప పురాణ గాథకి వేదికగా నిలిచిన ప్రదేశంలో నేను ఉన్నాను అనే సంతోషమా ? లేక నా తండ్రి పరమశివుడు దూషించబడగా అమ్మ దాక్షాయణి మనసు కలచివేయగా ఆమె ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశం ఇది అనే బాధా ? అమ్మ దుఖం ఒక్క సారిగా నా మనసుని ఆవరించింది.
పక్కనే దాక్షాయణి ప్రాణ త్యాగం చేసిన ప్రదేశంలో అవతరించిన ఘట్టాంబికా దేవికి నమస్కరించి దక్ష గుండం నుంచి వెనక్కి తిరిగాము. ఇక్కడితో దాక్షారామ యాత్ర ముగిసింది, సంభ్రమాశ్చర్యాల నడుమ ఇంకొక పుణ్య క్షేత్ర దర్శనానికి నాందిగా ...
స్వయంభూరస్తి భీమేశః మాణిక్యాంబా తథైవచ
సప్తర్షి భి స్సమానీతం సప్త గోదావరం శుభం
సూర్యేణ సేవితః పూర్వం భీమేశో జగదీశ్వరః
భక్త రక్షణ సంవ్యగ్రా మాణిక్యా దక్ష వాటికే

No comments:
Post a Comment