Amman

Amman
Nitya subha mangalam

Saturday, July 6, 2013

ధర్మ యజ్ఞంలో - సమిధలు

  కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో, కొన్ని జీవితాలు అంతు లేని దుఖాన్ని మాత్రమే చవి చూస్తూ ఎందుకు ఉంటాయో సామాన్య మానవుని ఆలోచనకి, విచక్షణకి అందదు.

భగవంతుడి సృష్టిలో ప్రతి ప్రాణికీ ఒక లక్ష్యం ఉంటుంది, ప్రతి జీవితానికీ ఒక గమ్యం ఉంటుంది. అతి కొద్ది మంది యోగులకి, జ్ఞానులకి మాత్రమే భగవంతుడి సృష్టిలో లీలలు అర్థం అవుతాయి.

శ్రీమద్రామాయణంలో రాముల వారు వనవాసానికి బయలుదేరినప్పుడు సీతా అమ్మవారు భర్తని అనుగమించారు. సాక్షాత్ శ్రీ మహా లక్ష్మి అమ్మవారు మానవ స్త్రీగా ఎన్నో కష్టాలు అనుభవించారు, భయానక సందర్భాలు ఎదుర్కొన్నారు, కృంగదీసే అవమానాలు భరించారు. అటువంటి మరొక పరమ సాధ్వీమణి ఊర్మిళ. భర్త లక్ష్మణుడు తన అన్నగారికి  తోడుగా వనవాసానికి వెళ్తుంటే, దుఃఖాన్ని దిగమింగి పంపారు. పదునాలుగు ఏండ్ల పాటు తీవ్రమైన ఒంటరితనాన్ని అనుభవిస్తూ నిద్రలో తన మొత్తం దుఃఖాన్ని దిగమింగుకున్నారు. రామావతార స్వీకారం ద్వారా భగవంతుడు చేయదలుచుకున్న ధర్మ సంస్థాపనలో తన వంతు కర్తవ్యమ్ తల్లి ఊర్మిళ ఇలా నెరవేర్చారు.

వేంకటనాథుడు రాఘవేంద్రస్వామి గా మారక మునుపు ఆయన ఒక గృహస్థు. భార్య బిడ్డడితో అతి దారుణమైన దారిద్ర్యాన్ని అనుభవించారు. ఆయన భార్య సరస్వతమ్మ భర్తని అనుగమించిన మహా ఇల్లాలు. కట్టు బట్టలు కూడా సరి అయినవి లేనంత కటిక దారిద్ర్యాన్ని భర్త సాన్నిధ్యమనే వెలుగులో అధిగమిస్తూ జీవనం సాగించారు. తరువాత రోజుల్లో వేంకటనాథుడు గురువు గారి ఆజ్ఞకి తలొగ్గి హఠాత్తుగా సన్యాసం, శ్రీ మఠం బాధ్యతలు స్వీకరించినప్పుడు సరస్వతమ్మ గారు ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. భర్త తోడే లోకం గా బ్రతుకుతూ అతి భయంకరమైన పరిస్థితులు భరించిన మహా ఇల్లాలు, భర్త పక్కన లేని జీవితాన్ని ఊహించుకోలేక ఈ లోకాన్ని వదిలిపెట్టారు. ఆ సమయంలో దుఃఖంతో మరణించిన ఆమె ఆత్మ శాంతి లేక అలమటిస్తూ ఉంటే రాఘవేంద్ర స్వామి ఆమెకి సద్గతులు కలిగించారు. లోక కళ్యాణానికి తన భర్తని త్యాగం చేసిన ఆ సాధ్వి, తన త్యాగానికి ఫలంగా పరమపదం చేరారు.

లోకంలో పరమేశ్వరుడు ధర్మ సంస్థాపన చెయ్యడానికి, దీనులని ఉద్ధరించడానికి యుగాన్ని బట్టి, కాలాన్ని బట్టి అనేక అవతారాలు స్వీకరించాడు, అలాగే గురు పరంపరని నెలకొల్పాడు. మహా విష్ణువు దశావతారాలు మొదలుకొని ఆది శంకరాచార్యులు, షిరిడి సాయిబాబా, మీరాబాయి, శ్రీపాద వల్లభ స్వామి, శృంగేరి గురు పరంపర, కంచి గురు పరంపర, నృసింహ తీర్థ స్వామి, సత్య సాయిబాబా, రమణ మహర్షి, రాఘవేంద్ర స్వామి, శ్రీల ప్రభుపాదులు, అమృతానందమయి అమ్మ - అఖండ భారతావనిలో ఈ ధర్మోద్ధరణ కార్యాన్ని నిర్వహించడానికి ఎందరో కారణజన్ములు వచ్చారు.

ఒక ధర్మోద్ధరణ కార్యం ఒకరి వల్ల జరుగుతోంది అంటే, భగవంతుడు వారి ద్వారా తన లీలను ప్రకటితం చేశాడు అని అర్థం. అలా తన లీలని ప్రకటితం చెయ్యడానికి ఆయన ఒకరిని ఎంచుకోవాలంటే వారు అనంతమైన పుణ్యం చేసి ఉండాలి. ఆ పుణ్యం వారు ఒక్కరిదే కాదు - ఆ ఎంచుకోబడిన వారి జీవితంలో అనేక సందర్భాల్లో తోడుగా నిలిచిన వారు, గురువులు, వారి పూర్వీకులు, కన్నవారు, తోడ బుట్టినవారు, జీవిత భాగస్వామి, బిడ్డలు - ఇంకా అనేక మంచి చెడులకు ప్రత్యక్షంగా పరోక్షంగా దోహదం చేసినవారు - ఇలా ఎంతో మంది పుణ్యఫలాలు కలిసి - ఆ వ్యక్తి  ద్వారా ప్రకటితం అయ్యి ఉంటాయి.

ప్రతి యుగంలోనూ ఎన్నో ధర్మ యజ్ఞాలు, యజ్ఞ కర్త భగవంతుడు, యాగాగ్నిగా ఎందరో సత్పురుషులు. యాగాగ్నులని నిలిపి ఉంచేవి ఎన్నో సమిధలు. ఈ సమిధలు - అనంతమైన దుఃఖాన్ని భరించి, 'భగవంతుడు వీరికి ఎందుకు ఇటువంటి భయంకరమైన దుఃఖాన్ని రాసి పెట్టి ఉంటాడు' అని అందరూ మధన పడేంత స్థితిలో ఉంటూ, జవాబు లేని ప్రశ్నలా మనకి కనిపిస్తారు. లౌకికమైన భావనలో వారి  జీవితానికి న్యాయం జరిగినట్టు మనకి అనిపించదు.

నవీన కాలంలో కూడా ఇలాంటి దృష్టాంతాలు మనకి కొన్ని కనిపిస్తున్నాయి -
జీవితంలో ఎన్నో కలలతో ముందుకు అడుగేస్తున్న ఒక బంగారుతల్లి 'నిర్భయ' , ఆరుగురు రాక్షసుల కర్కశత్వానికి అతి దారుణంగా బలి అయ్యింది. తనమీద జరుగుతున్న అన్యాయాన్ని శాయశక్తులా ఎదిరించింది, మృత్యువు అతి దారుణంగా కబళిస్తున్న సమయంలో కూడా ఎదిరించి నిలబడింది. అఖండ భారతావని ప్రజల్లో ఒక ధర్మాగ్రహాన్ని రగిలించి, దేశంలో స్త్రీల రక్షణ కోసం ప్రతి ఒక్కరినీ ఉద్యమించేలా చేసి, తను జీవిత రంగం నుంచి నిష్క్రమించింది. తమ ఆడ బిడ్డలని రక్షించుకోవాలనే విచక్షణని ప్రజలకి కల్పించి ఆసేతు హిమాచల పర్యంతం స్ఫూర్తిని, జాగృతిని వెలిగించిన మహా శక్తి ఆ తల్లి. ఆమెకి జరిగింది గుండె వెయ్యి వక్కలు అయ్యేంత భయంకరమైన అన్యాయమే! కానీ కోటాను కోట్ల ప్రజలను స్త్రీజన రక్షణ కోసం
కరడు కట్టిన జడత్వం నుంచి ధర్మాగ్రహం వైపు నడిపించే యజ్ఞంలో ఆ బంగారుతల్లి సమిధ అయ్యిందేమో ? 

వేలాది మంది చార్ ధామ్ యాత్ర పేరుతో పరమేశ్వరుడి సమక్షంలో తరించాలని ఆశపడి, ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చి దేవభూమి అయిన ఉత్తరాఖండ్ కి తరలి వచ్చారు. చూస్తూ చూస్తూ ఉండగానే గంగమ్మ మహోగ్రహ తరంగాలలో జల సమాధి అయ్యారు. నీటిలో కొట్టుకొని పోయిన వారు కొందరు, బురదలో కూరుకుని  ప్రాణాలు విడిచిన వారు కొందరు, కొండల మీద నుంచి దొర్లిన బండ రాళ్ళ కింద చితికి మరణించిన వారు కొందరు, ఆప్తులని కోల్పోయిన వారు కొందరు, అడవులలో అలమటించిన వారు కొందరు, దారుణమైన రీతిలో అంగ వైకల్యం బారిన పడ్డ వారు కొందరు, విష కీటకాల - క్రూర మృగాల భయానక దాడులని తప్పించుకుని గుండెలు అవిసిపోయిన వారు కొందరు, ప్రాణాలు పోయే స్థితిలో కుడా మనిషి మితి మీరిన స్వార్థానికి నివ్వెరపోయిన వారు కొందరు - ఇంత భయంకరమైన జల విలయం ఎందుకు వచ్చింది ? సామాన్య జనులకి తీర్థ యాత్ర ఒక ప్రాణాంతక అనుభవంగా ఎందుకు మారింది ? ప్రభుత్వం కాసుల కోసం ప్రాకృతిక స్వరూపాలని జల విద్యుత్ కేంద్రాల కోసం నామ రూపాల్లేకుండా చేసింది, అది చాలా పెద్ద తప్పు. శివ శక్తుల సహజ సంతులిత శక్తి తత్త్వం తో సుసంపన్నమైన పుణ్య క్షేత్రాలని - చార్ ధామ్ రక్షకురాలైన శక్తి ధారీ దేవిని - అభివృద్ధి పేరుతో సహజ స్థితి నుంచి పక్కకి తప్పించింది, ఇది మహా అపరాధం. అభివృద్ధి పేరిట భారత దేశంలోని దేవ భూమిలో ఈ మహాపరాథాలు జరగడం చూడలేక భూమాత, గంగమ్మ కన్నెర్ర చేశారు. భగవంతుడు చేస్తున్న ధర్మ యజ్ఞంలో ఈ సామాన్యులు ఏ విధమైన పాత్రని నిర్వహించడానికి ఇంత దుఃఖం పొందాల్సి వచ్చిందో ?

ఇది అంతా నా లాంటి సామాన్య మనిషికి అర్థం అయ్యే రీతిలో పరమేశ్వరుని లీలని / భావాన్ని తెలియజేయగల మహానుభావులు ఎవరన్నా తారసపడాలని కనులు కాయలు కాసేలా చూస్తున్నాను. "తీర్థయాత్ర కి వచ్చి మేము ఎన్ని కష్టాలు పడ్డామో" అని దుఃఖంలో వేదన చెందుతున్న ప్రజలకి ఈశ్వరుడి సంకల్పాన్ని / లీలని ప్రకటితం చెయ్యగల వారు ఒకరు రావాలి. హిందూ ధర్మం విస్తృతం అయినది, గంభీరమైనది, అద్భుతమైనది. ఎప్పుడూ సుఖం మాత్రమే ఆశించాలి అని హిందూ ధర్మం బోధించలేదు. సుఖమ్ దుఃఖం రెండిటినీ సమానంగా తీసుకోగల దీరోదాత్తతని హిందూ ధర్మం నేర్పుతుంది. అయితే జ్ఞానం పెద్దగా వికసించని వాళ్ళని - ఇటువంటి సంఘటనలను ఉదాహరణగా చూపించి - పర ధర్మం లోకి వారిని మరల్చగల ప్రలోభపెట్టే శక్తుల ప్రభావం నేడు బలంగా ఉంటోంది. అటువంటి వారి నుంచి అమాయకుల నమ్మకాన్ని రక్షించడానికి నా స్వామి తన దూతని మా మధ్యకి పంపాలి.

తండ్రీ  ! నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాము, తల్లి ప్రకృతి మాకు ఇచ్చిన జీవనాన్ని మా చేతులతో నాశనం చేసుకున్నాం. మా తోటి జీవులకి మనుగడ  లేకుండా చేశాము. నువ్వు బ్రతకమన్న రీతిలో బ్రతకకుండా వెర్రి తలలు వేశాము. మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించి కడుపులో పెట్టుకు కాపాడు. నీ పరిపూర్ణ సృష్టి నియమాలను గౌరవిస్తూ, నీ మంగళ కర తత్త్వాన్ని అవగతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే వరాన్ని అనుగ్రహించు, మమ్మల్ని కనికరించు !


No comments:

Post a Comment