Amman

Amman
Nitya subha mangalam

Wednesday, November 28, 2012

తలంపులమ్మ - లోవ

తలంపులమ్మ - తలుపులమ్మ

ఆంధ్ర ప్రదేశ్ లో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర లో దాదాపు ప్రతి వాహనం వెనుక రాసి ఉండే పేరు - తలుపులమ్మ తల్లి. అక్కడ పూజ చేయించిన వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగదు అని చాలా మంది నమ్మకం.



తలుపులమ్మ అమ్మవారి ఆలయం ఆవిర్భావం వెనుక ఒక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం ఒక సారి వింధ్య పర్వతం మేరు పర్వతం తో పోటీ పడి అమాంతంగా తన ఎత్తుని పెంచుతూ వెళ్ళిపోయిందట. ఎంత ఎత్తుకి వెళ్లిందంటే, సూర్య రశ్మి భూమి కి చేరనంత. ప్రాణి కోటి మొత్తం విలవిల లాడిపోయిందట. అప్పుడు దేవతలు అగస్త్య మునిని చేరుకొని ఈ కష్టాన్ని గట్టెక్కించమని ప్రార్థించారు (వింధ్య పర్వతానికి అగస్త్య ముని గురువుగారు). నిత్యం కాశీలో శివ ఆరాధనలో మునిగి ఉండే అగస్త్య మునికి కాశీని విడిచిపెట్టడం ఇష్టం లేదు, కానీ లోక కల్యాణం కోసం మనసు దిటవు చేసుకుని దక్షిణ దేశానికి బయలుదేరారు అగస్త్య మహా ముని. కాశీని విడిచిపెట్టిన బాధ తీర్చుకోవడం కోసం ముని తన యాత్ర పొడవునా ఎన్నో శివ లింగాలను ప్రతిష్ట చేశారు. ఆ శివ లింగాలను ప్రతిష్టించిన స్థలాలు తరువాత అగస్త్యేశ్వర స్వామి క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. అలా దక్షిణ దేశం వైపు వెళ్తూ వింధ్య పర్వతాన్ని చేరారు మహర్షి. వింధ్య పర్వతుడు అమితానందంతో గురువు గారికి వంగి నమస్కారం చేశాడు. అప్పుడు అగస్త్యుడు - తను దక్షిణ భారత దేశ తీర్థ యాత్రలకు బయలుదేరాడని, తను తిరిగి వచ్చే వరకు వింధ్య పర్వతుడు అలాగే వంగి ఉండాలని ఆదేశించాడు. పర్వతుడు గురువు గారి ఆజ్ఞను శిరసావహించాడు. వింధ్య పర్వతాన్ని అలాగే వంచి ఉంచేందుకు అగస్త్యుడు తిరిగి ఉత్తర భారత దేశానికి వెళ్ళలేదు.

అలా అగస్త్య మహాముని నేడు తుని -లోవ ఉన్న అరణ్య ప్రాంతాన్ని దాటుతూ ఉండగా చీకటి పడింది. అంత  కారడవిలో అర్ఘ్యం ఇవ్వడానికి నీరు కానీ, దాహం - ఆకలి తీరే మార్గం కానీ  కనిపించలేదు. అప్పుడు అగస్త్యుడు ఒక చెట్టుకి చేరగిల పడి కూర్చుని ఆది దంపతులని తలచుకోగానే, ఒక వృక్ష సముదాయం మధ్యలో కనులకి దేదీప్యమానం అయిన కాంతి కనిపించింది.



అమ్మవారి వాణి వినిపించింది. "తాను లలితా దేవినని, భక్త రక్షణ కోసం అడవిలో వన దేవత గా సంచరిస్తున్నానని" చెప్పింది. అప్పుడే అమ్మవారు ఒక నీటి ధారని, ఆహారాన్ని అగస్త్య మునికి ప్రసాదించింది. ముని అర్ఘ్యాదులు పూర్తి చేసి ఆహారం స్వీకరించారు. లోకమాతని అక్కడ భక్త రక్షణార్థం కొలువై ఉండమని ప్రార్థించారు. అమ్మ అలాగే ఇప్పుడు ఉన్న స్వరూపంతో అర్చా మూర్తిగా కొలువయ్యారు. తలచుకోగానే ఆడుకున్న అమ్మ కనుక ముని అమ్మవారిని - తలంపులమ్మ - అని కొలిచారు. ఆ పేరు జన బాహుళ్యం వాడుకలో తలుపులమ్మ అయ్యింది.



అలా తలుపులమ్మ గోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎన్నో కుటుంబాలకి ఇలవేలుపు అయ్యింది. అమ్మవారి గుడి ఒక లోయలో రెండు కొండల మధ్య నెలకొని ఉంది, అమ్మవారి స్వయం భూ విగ్రహం గుహలో వెలిసి ఉంటుంది. అక్కడ జలధార (గంగ ధార) మొదలు ఎక్కడో చివర ఎక్కడో ఈ రోజుకి కూడా ఎవరికీ తెలియదు. ఎవరూ ఇంత  వరకూ కనిపెట్టలేకపోయారు. ఆ నీరు తియ్యగా, ఏడాది పొడవునా పారుతూనే ఉంటుంది.

తలుపులమ్మ సత్యం ఉన్న తల్లి. పిలిస్తే పలికే అమ్మ. ఈ రోజుకీ ఆ లోవ అటవీ ప్రాంతంలో సాయంకాలం అయ్యేసరికి జనులు సంచరించరు. అది అక్కడ కట్టుబాటు. అమ్మవారి గుడి సాయం కాలం 5.30 గంటల తరువాత మూసి వేస్తారు. అటు పిమ్మట అమ్మవారు లోయలో వన దుర్గ లాగ తిరుగుతూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. అమ్మ లీల ఏమిటో తెలిపే సంఘటనలు ఈ రోజు వరకూ జరుగుతూనే ఉన్నాయి.

నవీన కాలంలోనే ఒక జంట వారి అయిదేళ్ళ పాపతో కలిసి అమ్మని దర్శనం చేసుకున్నారట ! తిరిగి కిందకి వచ్చేటప్పుడు బంధు వర్గంతో మాట్లాడుతూ హడావిడిలో వారి పాప గుడి మెట్లు దిగి కొండ కిందకి రాని సంగతి గుర్తించలేదు. గుడి మూసి వేసి పూజారి కూడా కిందకి వచ్చేశారు. అప్పుడు తల్లి బిడ్డ కోసం వెతికి, కానరాక - కంగారు పడుతూ, దుఃఖిస్తూ తమ వాళ్ళు అందరికీ తెలియజేసింది - పసి పాప గుడి మెట్లు దిగి కిందకి రాలేదని. వారు ఎటూ తేల్చుకోలేని అయోమయం లో పడ్డారు. పూజారులు కూడా కట్టుబాటు తప్పి కొండ మీదకి నిషేధిత సమయంలో వెళ్లి తప్పు చేయవద్దని సూచించారు. అందరిలోనూ అనేక ప్రశ్నలు. ఆ తల్లి దండ్రులు రాత్రి మొత్తం క్షణం ఒక యుగం లాగ గడిపారు. ఈ లోపు తెల్లారింది. అమ్మవారి గుడి తెరిచే సమయం అయ్యింది. పసి పిల్ల తల్లి దండ్రులు మెట్లు ఎక్కి లోవ గుడి లోకి పరుగులు తీశారు.



వారి కుమార్తె నవ్వుతూ ఆడుకుంటూ ఎదురు వచ్చింది. తల్లి దండ్రులు పాపని అడిగారు "రాత్రి అంతా భయం వెయ్యలేదా ? ఒక్క దానివే ఎలా ఉన్నావు ? ఆకలి వెయ్యలేదా ?" అని. అప్పుడు పాప చెప్పిందట "అదేమిటి అమ్మా ! నువ్వు మొత్తం రాత్రి అంతా నాతోనే ఉన్నావు కదా. నాకు అన్నం పెట్టావు, నిద్ర పుచ్చావు కదా. నాకు భయం ఎందుకు ?"

ఎప్పుడో మనకి తెలియని పురాణ కాలంలో మాత్రమే కాదు, తలుపులమ్మ - అప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ - తలచుకోగానే వచ్చి అక్కున చేర్చుకుని ఆపదలు బాపే తల్లి. సత్యమున్న తల్లి.

" శ్రీ లలితే నమోస్తుతే !"

Friday, November 2, 2012

హృదయం పావన్ గౌతమీ తటమ్ - 3

దాక్షారామం ...

పంచారామ లింగం, శక్తి పీఠ క్షేత్రం. ఆది దంపతులకి అత్యంత ఇష్టమైన క్షేత్రాలలో (కాశి, శ్రీకాళహస్తి, శ్రీశైలం, ఉజ్జయిని, కాంచీపురం క్షేత్రాల కోవలో) ఇది కూడా ఒకటి. అష్టాదశ శక్తిపీఠ ఆవిర్భావ కథకి వేదిక దాక్షారామం. దక్షుడు యజ్ఞం చేసిన భూమి ఇది.



యజ్ఞంలో పరమశివుడికి హవిస్సు ఇవ్వకుండా చేయ తలపెట్టిన దక్షుడి అహంకారం సమూలంగా తీసివేయబడ్డ భూమి ఇది. శివుడు - అంటే అర్థం శుభం కలిగించే వాడు. శివ దర్శనం శుభకరం, శివ నామ స్మరణ శుభకరం, శివ పూజ శుభకరం, శివ అభిషేకం శుభకరం.

"శివుడు లేకుండా తలపెట్టిన ఎంత గొప్ప పని అయినా దానికి శుభం లేదు" అని పార్వతీ మాత లోకానికి తెలియజెప్పడానికి 'దాక్షాయణి'గా తన శరీరాన్ని విడిచిపెట్టిన స్థలం దాక్షారామం.  

ఇది మాత్రమే కాదు, దాక్షారామం సామాన్య మానవాళికి ఇచ్చే సందేశాలు ఎన్నో -

1) మన దీక్ష ఫలితంగా భగవంతుడు మనని కరుణిస్తే, మరింత జాగరూకతతో వినయంగా వ్యవహరించాలి. ఒక సారి పరమాత్మ దయ వల్ల మనకి జరిగిన మంచిని మన గొప్పతనం అనుకోవడం మొదలుపెడితే పతనం అక్కడే మొదలవుతుంది.

దక్షుడు మొదట ప్రజాపతి అని గర్వించాడు. తన తపోఫలంగా అమ్మవారిని కుమార్తెగా పొందాక ఆమెకి తండ్రిగా సర్వాధికారం తనదే అన్నట్టు ప్రవర్తించాడు. అకారణంగా అల్లుడి వ్యక్తిత్వం గుర్తించక ద్వేషం పెంచుకున్నాడు. అహంకారంతో గౌరవనీయమైన వారిని అవమానించబోయాడు.

2) పరమాత్మకి వ్యతిరేకంగా, అహంకారంతో ప్రవర్తించిన వారికి నాశనం తప్పదు.

3) భార్యకి భర్త పట్ల ఉండాల్సిన ప్రేమని, గౌరవాన్ని పార్వతీదేవి సతీ దేవి రూపంలో చూపించింది.

4) భర్త భార్య పట్ల ఎంత అనురాగంతో ఉండాలో, దంపతులు ఒకరి ప్రాణం ఒకరుగా ఎలా ఉండాలో స్వామి చూపించారు.

కాశీలో సహజ మరణం పొందే వారికి అంత్య కాలంలో, సాక్షాత్ పరమశివుడు చెవిలో ప్రణవ మంత్రాన్ని వినిపించి విశాలాక్షీ గణపతి దేవుల సాక్షిగా తనలో కలిపేసుకుంటాడని సనాతనుల విశ్వాసం. తిరిగి భూమండలం మీద అలా సహజ మరణం పొందే సమయంలో, పరమశివుడు స్వయం గా వచ్చి మంత్రోపదేశం చేసే ఏకైక క్షేత్రం ఒక్క దాక్షారామం మాత్రమే అని అంటారు. జీవుడి శరీరం పడిపోయే సమయంలో దాక్షారామంలో, అమ్మ మాణిక్యాంబ వచ్చి తన ఒడిలో బిడ్డను పడుకోబెట్టుకుని గాలి విసురుతూ ఉంటే, భీమేశ్వరుడు  ప్రణవ మంత్రాన్ని ఉపదేశం చేస్తారట.


దాక్షారామం వద్ద సప్త గోదావరుల సంగమ తీర్థం వద్ద ఉంది. సప్త గోదావరులు అంతర్వాహినులుగా వచ్చి ఆ తీర్థంలో కలుస్తాయి. దాక్షారామం చుట్టు పక్కల అంతా సుభిక్షమైన భూమి, పచ్చని వరి పొలాలతో అన్నపూర్ణగా వర్ధిల్లుతున్న భూమి. సామర్లకోట భీమేశ్వర స్వామి లాగ దాక్షారామ స్వామి కూడా రెండు అంతస్తులలో ఉంటారు. కింద పానపట్టం, శివ లింగంలో కొంత భాగం దర్శనం ఇస్తాయి. అభిషేకాదులు చెయ్యాల్సిన లింగం పై భాగం రెండో అంతస్తులో ఉంటుంది. ఈ క్షేత్రానికి పాలకుడు లక్ష్మీ నారాయణ స్వామి. గుడి లోపలి ప్రాకారం లో అడుగు పెట్టిన వెంటనే కుడి పక్కన లక్ష్మీ నారాయణ స్వామి ఉంటారు. దాక్షారామంలో విశేషం ఏమిటంటే, ఎప్పుడు మాణిక్యాంబ భీమేశ్వర స్వామి కల్యాణం చేసినా, అదే పందిరిలో శ్రీ లక్ష్మీ నారాయణుల కల్యాణం కూడా కలిపి చేస్తారు. ఇద్దరు ఆది దంపతుల కళ్యాణాలు ఒకే పందిరిలో జరుపుతారు - ఇంక ఆ ప్రాంతం సుభిక్షంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు.



కింద అంతస్తులో స్వామి లింగానికి ప్రదక్షిణ చేసే మార్గం ఉంటుంది, అంతా చిమ్మ చీకటి గా ఉంటుంది. అక్కడ రాతి గోడల మీద బొడిపెలు ఉంటాయి. పూర్వం అక్కడ వజ్రాలు ధగ ధగ మెరుస్తూ ఉండేవట. వాటి కాంతులలోనే భక్తులు ప్రదక్షిణ చేసేవారట. ఒక కాలంలో దొంగలు ఆ వజ్రాలు దొంగిలించే ప్రయత్నం చెయ్యగా మాణిక్యాంబ అమ్మవారి ఆగ్రహం తో వాళ్ళు శిలలు అయ్యారని, అప్పటి నుంచి వజ్రాలు రాళ్ళు అయ్యాయని చెప్తారు. దాక్షారామ ఆలయం ఒక రాత్రి లో దేవతలు కట్టారని, సుర్యోదయంలోపు పై కప్పులో ఒక చిన్న భాగం పూర్తి చెయ్యలేక వదిలేశారని అంటారు. పై అంతస్తులో స్వామి వారికి ప్రదక్షిణ చేస్తుంటే ఈ అసంపూర్ణం గా వదిలేసిన కప్పు రంధ్రం కనిపిస్తుంది. అక్కడ నుంచి స్వామి ఆలయ శిఖరం చూడడం గొప్ప అనుభూతి. సామర్లకోట స్వామి లాగే దాక్షారంలో కూడా స్వామి తెల్లని స్ఫటిక లింగం. పంచామృత అభిషేకం, సుగంధ ద్రవ్యాల అభిషేకం, పుష్పాలంకారం అన్నీ అత్యద్భుతంగా ఉంటాయి.



దాక్షారామంలో ఉన్న విశేషం ఏమిటంటే గర్భ గుడిలో స్వామి పక్కనే, సతీదేవి విగ్రహం ఉంటుంది. భర్త పట్ల అవ్యాజమైన అనురాగం కల బంగారు తల్లి మా దాక్షాయణి, భర్త గౌరవమే తన ఆభరణంగా మెలిగిన మహా పతివ్రత నా తల్లి దాక్షాయణి.



స్వామి గుడి మెట్లు దిగి వెనుక భాగంలో ఉన్న మండపానికి వెళ్తే అక్కడే శక్తి పీఠ అధినేత్రి మాణిక్యాంబ అమ్మవారు కొలువై ఉంటారు. అమ్మ మూర్తి బహు తేజోమయంగా ఉంటుంది. నాలుగేళ్ల పసి బిడ్డ నగుమోముతో మనం ముందు కూర్చున్నట్టు ఉంటుంది.

మా నాన్నగారు, పెదనాన్న గారు స్వయంగా స్వామి కి అభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజ చేసుకునే అదృష్టాన్ని పొందారు. ఆ రోజు దాక్షారామం లో దిగిన దగ్గర నుంచి తిరిగి దాక్షారామం వదిలి వచ్చే వరకు, సన్నని తుంపర మమ్మల్ని తాకుతూనే ఉంది. నిరంతరం స్వామి ఝటాఝూటంలో పొందికగా ఒదిగి ఉండే ఆకాశ గంగమ్మ, స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చిన మమ్మల్ని ఆనందంతో ఆహ్వానిస్తూ, ఆశీర్వదిస్తున్నట్టు నాకు తోచింది. చుట్టూ రెండు ప్రాకారాల మధ్యలో ఠీవిగా నిలబడ్డ అతి విశాలమైన దాక్షారామ ఆలయం, ఉపాలయాలు, అక్కడ నేల, చెట్టు చేమలు, పుట్టలు, శిల్పాలు, రాళ్ళు రప్పలు - అన్నిటినీ అభిషేకిస్తోంది ఆకాశ గంగమ్మ, మాతోపాటుగా. ఆ క్షణం నా చుట్టు పక్కల అన్నిటిలో మాత్రమే కాదు, నా లోపల కూడా పరమ శివుడే ఉన్న భావన... అణువు అణువునా  ఉన్న పరమశివుడికి జలాభిషేకం జరుగుతోంది అక్కడ.



లోపల ప్రాకారం నుంచి మొదటి ప్రాకారం మధ్యలో ఉన్న అశ్వత్థ నారాయణ వృక్షం దగ్గరకు వచ్చాము. భీమేశ్వర స్వామి గర్భ గుడి నుంచి బయటకు వచ్చి రెండు ప్రాకారాల తలుపులు దాటి సప్త గోదావరీ తీర్థానికి వెళ్ళే మార్గం లో - రెండు ప్రాకారాల నడుమ వున్న అతి విశాలమైన ప్రాంగణంలో - ఈ వృక్షం ఉంది, ఆ వృక్షం మొదలులో శివ నారాయణుల మూర్తులు ఉన్నాయి. వృక్షం మొదలులో చుట్టూ అనేక నాగ శిలలు ప్రతిష్ట చేసి ఉన్నాయి. సప్త గోదావరీ తీర్థం లో ఉన్న నీటితో శివ కేశవులని అభిషేకించడం అత్యంత పుణ్య దాయకం. తీర్థం నుంచి అభిషేకానికి నీరు తీసుకు వస్తుంటే,ఒడ్డున ఉన్న ఒక మంటపంలో, అతి నిరాడంబరంగా సాదాసీదాగా ఉన్న ఆహార్యంతో ఒక తల్లి చేతిలో లలితా సహస్ర నామ పుస్తకంతో ధ్యానం చేసుకోవడం గమనించాను. ఇంటిలో లౌకిక వ్యాపారం ముగించి వచ్చి, అమ్మవారి ధ్యానం చేసుకుంటున్నట్టుగా ఉంది ఆ తల్లి. ఆమెను అర గంట క్రితం  మాణిక్యాంబ అమ్మవారి గుడిలో స్తంభానికి చేరగిలబడి, చుట్టూ పరిసరాలతో సంబంధం చేకుండా సాధన చేస్తూ ఉండగా చూశాను. ఎందుకో ఆ తల్లిని చూడగానే హిమాలయాలలో ఏకాగ్ర చిత్తంతో తపస్సు చేసుకునే మహర్షులు గుర్తుకు వచ్చారు.

అశ్వత్థ నారాయణ వృక్షం నుంచి కాల భైరవ స్వామి గుడికి వెళ్లి ఆయనను దర్శించుకోగానే, అమ్మ మాణిక్యాంబ గుడి ప్రాంగణం లో జరుగుతున్న అన్నదానంలో మాకు ఆప్యాయంగా ప్రేమగా భోజనం తినిపించింది. ఎక్కడ అన్నదానం జరుగుతుందో, అక్కడ శాంతి ఉంటుంది. ఎవరన్నా ఎక్కడన్నా అన్నదానంలో తినడానికి కూర్చున్నప్పుడు చెయ్యాల్సిన మొదటి పని -

"అన్నపూర్ణే ! సదా పూర్ణే ! శంకర ప్రాణ వల్లభే
 జ్ఞాన వైరాగ్య సిద్ద్యర్థం భిక్షామ్దేహిచ పార్వతీ
 మాతా చ పార్వతీ దేవీ పితాదేవో మహేశ్వరః
 బాన్ధవాః శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్"

కడుపు నిండా తిని లేచాక చెయ్యాల్సిన మొదటి పని -

"అన్నదాతా సుఖీభవ ! అన్నదాతా సుఖీభవ ! అన్నదాతా సుఖీభవ !"

మన క్షేత్రాలలో నిత్య అన్నదానాన్ని మొదలుపెట్టి నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న యజ్ఞంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరికీ శుభం కలుగుగాక !

దాక్షారం గుడిలో దర్శనం అయ్యాక బయటకు వచ్చిన వెంటనే ఎడమ పక్కన సప్త గోదావరీ తీర్థం ఒడ్డున ఒక పురాతన ఆలయం ఉంది. అక్కడ పరమేశ్వరుడు సర్వమంగళా దేవి సమేతం గా కొలువై ఉన్నాడు. మెడలో ప్రస్ఫుటం గా కనిపించే మంగళ సూత్రాలతో స్వామి పక్కన కూర్చుని ఉన్న మా సర్వ మంగళాదేవిని - మంగళములకే మంగళము అయిన మా తల్లిని - చూడగానే లోలోపల ఇది అని చెప్పలేని ఒక పులకరింత, కళ్ళలోనూ - మనసులోనూ - దేహం లోనూ - ఆలోచనలోనూ ఏదో సంతృప్తి.

అక్కడ నుంచి నేను ఎన్నో రోజుల నుంచీ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న దక్ష గుండానికి వెళ్ళాము. గుడికి ఫర్లాంగు దూరంలో, కోటిపల్లి రోడ్డులో విజయా సినిమా హాలు పక్కన, పెద్దగా దృష్టికి అందని ఒక తోటలో ఉంది ఈ దక్ష గుండం. గేటు నుంచి లోపల ఇరుకైన దారిలో ఒక పావు కిలోమీటరు నడిస్తే, చెట్టు చేమలు నీటి ధారల మధ్య ఒక ఆలయం, పక్కన చిన్న కొలను ఉన్నాయి.

ఆ కొలను ఒకప్పుడు దక్ష యజ్ఞం జరిగిన దక్ష గుండం. కిందకి మెట్లు దిగి కొలను ఒడ్డుకి వెళ్లాను. కొలను మధ్యలో దాక్షాయణి విగ్రహం నిలిపిన చిన్న మందిరం ఉంది. కొలను ఒడ్డు నుంచి మందిరానికి చిన్న చెక్క బల్ల వేశారు. దాని మీద నడిచి వెళ్లి దాక్షాయణి అమ్మ పాదాలకి మొక్కాను. తిరిగి వెనక్కి వచ్చేశాను. ఒక్క సారి వెనక్కి తిరిగి చూశాను. శరీరం అంతా విద్యుత్తు పాకిన అనుభూతి. ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి ... ఇది బాధా, సంతోషమా ? గొప్ప పురాణ గాథకి వేదికగా నిలిచిన ప్రదేశంలో నేను ఉన్నాను అనే సంతోషమా ? లేక నా తండ్రి పరమశివుడు దూషించబడగా అమ్మ దాక్షాయణి మనసు కలచివేయగా ఆమె ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశం ఇది అనే బాధా ? అమ్మ దుఖం ఒక్క సారిగా నా మనసుని ఆవరించింది.

పక్కనే దాక్షాయణి ప్రాణ త్యాగం చేసిన ప్రదేశంలో అవతరించిన ఘట్టాంబికా దేవికి నమస్కరించి దక్ష గుండం నుంచి వెనక్కి తిరిగాము. ఇక్కడితో దాక్షారామ యాత్ర ముగిసింది, సంభ్రమాశ్చర్యాల నడుమ ఇంకొక పుణ్య క్షేత్ర దర్శనానికి నాందిగా ...

స్వయంభూరస్తి భీమేశః మాణిక్యాంబా తథైవచ
సప్తర్షి భి స్సమానీతం సప్త గోదావరం శుభం
సూర్యేణ సేవితః పూర్వం భీమేశో జగదీశ్వరః
భక్త రక్షణ సంవ్యగ్రా మాణిక్యా దక్ష వాటికే

హృదయం పావన గౌతమీ తటమ్ - 2

పీఠికా పురం - పిఠాపురం
ఇది దేవ భూమి. ఇక్కడి ప్రతి అణువు దైవం నడయాడిన పవిత్ర భూమి.



పిఠాపురం లో మొదట శ్రీ పాద వల్లభ సంస్థానానికి వెళ్ళాము. ఇప్పటి వరకు దత్తాత్రేయ స్వామి మొదలుకొని షిర్డీ సాయిబాబా వరకు ఉన్న గురు పరంపర లో, శ్రీ పాద వల్లభ స్వామి అవతారం విశేషం అయినది. పిఠాపురం లో దత్తాత్రేయ అంశగా ఒక పుణ్య దంపతులకి జన్మించి, గురు స్వరూపమై ఎందరో సామాన్యులను ఉద్ధరించి, వేదోక్తమైన జీవనాన్ని - ధర్మాన్ని నిలిపి, జీవుల కర్మలను బాపి, గానుగా పురం లో నివశించిన స్వామి ఆయన. స్వామి జన్మించిన ఇల్లు ఇప్పటి మహా సంస్థానం. ఆ సంస్థానం లో ఉచిత వసతి, నిత్య అన్నదానం జరుగుతూ ఉంటాయి. ఆయన నీడలో ఎందరో దుఃఖం అనే మాటని పూర్తి గా మరచి ఆనంద సముద్రం లో ఓలలాడుతున్నారు. అక్కడ కొన్ని గంటలు ప్రశాంతత పరుచుకున్న వాతావరణం లో గడిపాము. అక్కడ ఔదుమ్బర వృక్షానికి ప్రదక్షిణ చేశాము.




 అక్కడ నుంచి పంచ మాధవ క్షేత్రాలలో  ఒకటి అయిన కుంతీ మాధవ స్వామి ఆలయానికి వెళ్ళాము. అతి ప్రాచీనమైన అద్భుతమైన గుడి అది, యుగ యుగాల నాటి ఆలయం అది.

"అధరం మధురం నయనం మధురం
వదనం మధురం వచనం మధురం
చరణం మధురం మధురమే మధురం
శ్రీ మధురాధిపతే అఖిలం మధురం"



అక్కడి నుంచి స్వయంభూ కుక్కుటేశ్వర స్వామి, పురుహుతాంబ శక్తి పీఠం, స్వయంభూ దత్తాత్రేయ మూర్తి ఉన్న పాద గయా క్షేత్రానికి వెళ్ళాము. స్వయం గా ధర్మ పరుడైనా తన వర్గం లోని వ్యక్తుల అధర్మ వర్తనాన్ని ప్రోత్సహించినందుకు, పాప పుణ్యాల ధర్మ చక్ర మార్గానికి అడ్డుగా నిలిచినందుకు త్రిమూర్తులచే  శిక్షింప బడిన గయాసురుడు - శిరో గయ (అధిదేవత విష్ణువు, మంగళ గౌరీ శక్తి పీఠం), నాభి గయ (అధిదేవత బ్రహ్మ, విరజా దేవి శక్తి పీఠం), పాద గయ (అధిదేవత శివుడు, పురుహూతికా శక్తి పీఠం) -  అనే మూడు క్షేత్రాల రూపం లో పూజనీయుడు అయ్యాడు. పాద గయా క్షేత్రం లో ఉన్న సరోవరం లో గయుడి పాదాలు ఉన్నాయని నమ్మకం. ఆ పవిత్ర కోనేటి నీటిని తలపై చల్లుకుని పురుహూతికా అమ్మ గుడి లోకి అడుగుపెట్టాము.



అమ్మ దేదీప్యమానం గా వెలుగుతోంది. అమ్మ తేజస్సు కనుల నిండా, మనసు నిండా పరుచుకుంది. సంధ్యా సమయంలో , దీప కాంతులలో అమ్మ కనులు, వంపులు తిరిగిన కను రెప్పలు, ముక్కెర, బేసరి - ధగ దగా కాంతులు చిమ్ముతున్నాయి. మా అమ్మ, పెద్దమ్మలు లలితా సహస్ర నామ పారాయణం చేశారు, ఈ జగజ్జననిని చూస్తూ - ఎదురుగా కూర్చుని. గంటలు గడిచాయి, అమ్మ ప్రేమ పూరితమైన దర్శనం గంటలను కరిగించేస్తోంది.

ఎన్నో రోజుల నుంచి నాలో అహంకారం జడలు విప్పుకుంది, పురుహూతికా అమ్మవారి విశిష్టత గురించి కొంచెం తక్కువగా ఆలోచించే అజ్ఞానం నాలో పాతుకు పోయి ఉంది. పిఠాపురం లో పురుహూతికా అమ్మవారి తేజస్సు భరించలేక అమ్మ వారి విగ్రహం భూమి లో దాచేశారని, ఇప్పుడు ఉన్న విగ్రహం నవీన కాలం లో ప్రతిష్ట చేసారని ఎక్కడో చదివాను. ప్రపంచం లో ప్రతి అణువులోనూ అమ్మ నిండి ఉందన్న సత్యాన్ని గ్రహించి, అమ్మ ముందు మంచి పుత్రుడి గా ఉండాల్సిన నేను వక్రం గా ఆలోచించాను. స్వయంభూ విగ్రహం కాని ఇప్పటి అమ్మవారి మూర్తి నా '(అ)జ్ఞానానికి' ఆనలేదు (అమ్మా! ఇలాంటి భావన చేసినందుకు నా లాంటి మూర్ఖుడిని క్షమించు). ఒకింత నిర్లక్ష్య భావన అప్పుడప్పుడు జడలు విప్పుతూ ఉండేది. కానీ, ఇప్పుడు ఈ రోజు మళ్లీ మళ్లీ అమ్మ తేజోమయ రూపం మనసు ని లాలిస్తోంది. ఎన్ని గంటల పాటు అయినా కను రెప్ప వెయ్యకుండా చూడాలనిపించే పురుహూతాంబ రూపం మిగతా అన్నిటినీ మరిచిపోయేలా చేస్తోంది. మునుపు రెండు సార్లు అమ్మ వారిని చూసినా కూడా నాకు ఇప్పుడు తాదాత్మ్యత ఎక్కువగా అనిపిస్తోంది.



అక్కడే వెలిసిన కుక్కుటేశ్వర స్వామిని, హూంకారిణి దేవిని (ఈ అమ్మ హూంకారం తో రాక్షస సంహారం చేసిందట), రాజ రాజేశ్వరీ దేవిని (కుక్కుటేశ్వర స్వామి వారి దేవేరి), గణపతిని  దర్శించి దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళాము. అక్కడ పూజారి గారు నేను అడగకుండానే పురుహూతికా శక్తి పీఠం గొప్పతనాన్ని నాకు వివరించారు (అమ్మకి నా అజ్ఞానాన్ని తుడిచి వెయ్యాలనే సంకల్పం కలిగిందేమో!)


సతీ దేవి శరీర భాగాలలో పీఠ భాగం పడిన క్షేత్రం ఈ పిఠాపురం.

అమ్మ పీఠ భాగాన్ని చూడడం నిషేధం కాబట్టి  అమ్మ ధ్యానరూపాన్ని విగ్రహంగా మలిచి గుడిలో నిలిపి పూజలు  చేస్తున్నారు. ఇప్పటికీ అమ్మవారి పీఠం భూమి లోపల, భూమికి సమాంతరంగా కనీసం అర కిలోమీటరు విస్తరించి ఉందట. పిఠాపురం ఊరి మధ్యలో ఉన్న గ్రామ దేవత ఆలయం వరకు బ్రహ్మాండంగా విస్తరించి ఉందిట. యోగులు, శక్తి  ఉపాసకులు అమ్మవారిని కొలవడానికి జ్ఞాన నేత్రంతో అమ్మవారిని దర్శించగలరు. సామాన్య జనుల కోసం ఈ రోజు అమ్మ వారి శక్తి పీఠ ఆలయం, మూల మూర్తి  సరళంగా ఇలా దర్శనం ఇస్తున్నాయి.


బ్రహ్మాండం అంత అమ్మ వారి చైతన్యం మనసు మొత్తం నింపి వెయ్యగా, ఆత్మ అంతా అమ్మవారి కోసం తపిస్తూ ఉండగా - అక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాంబ, కాల భైరవ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, దుర్గా దేవి ఆలయాలు చూశాము. దుర్గాంబ ఆలయం దగ్గర దీపారాధన చేశాము. అది సోమవారం, ఆది దంపతులు పాద గయలో విహారం చేస్తూ అక్కడ చాల మంది భక్తులు వెలిగించిన దీపపు కాంతులలో మెరిసిపోతున్నట్టుగా ఉంది. నా లాంటి మంచు కమ్మిన మనిషి లోపల వెచ్చని వెలుగు వ్యాపిస్తున్నట్టు అనిపించింది. పున్నమి చంద్రుడి కాంతిలో, లేత చల్ల గాలుల స్పర్శలో దీపం నిర్మలం గా ప్రకాశిస్తోంది ...  చెవుల నిండా శ్రావ్యం గా వినిపిస్తున్నాయి - "ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం శ్రీ మాత్రే నమః" !





హృదయం పావన గౌతమీ తటమ్ - 1

ఎటు చూసినా జలం, ఆకాశం కుండ పోత గా వర్షిస్తోంది.
చుట్టూ జీవం నింపుకుని ఆకుపచ్చ గా కళ కళలు ఆడుతున్న భూమి.

కుంభ వృష్టిలో తడిసి ముద్దవుతున్న నేలని చూస్తుంటే, ఆ నేల ఆసాంతం ఒక పెద్ద శివ లింగం లాగా, ఆకాశం పూజారి గా మారి నిండు గా అభిషేకం చేస్తున్నట్టు గా ఉంది.

మా నాన్న గారి షష్ఠి పూర్తి సందర్భం గా పావన గౌతమీ తీరం లో ఉన్న కొన్ని క్షేత్రాలు దర్శించాలని బయలుదేరాము. మా కుటుంబం లోని పెద్దలు కూడా వచ్చి, ఆ యాత్ర ని మరింత తేజోమయం చేశారు. అక్కడ అన్ని రోజులు కుంభ వృష్టి కురుస్తున్నా మేము ఎక్కడా క్షేత్ర దర్శనం లో తడిసి ముద్దలా మారి, అసౌకర్యానికి లోనవడం జరగలేదు...  ఎక్కడ మేము వాహనం దిగే సమయానికి అయినా జోరు వాన కూడా క్షణాల్లో ఆగిపోయేది. అమ్మవారు మమ్మల్ని ప్రతి చోటా భద్రం గా, ప్రేమ గా వేలు పట్టుకుని నడిపించారు. దానిలో మా గొప్ప తనం ఎంత మాత్రమూ లేదు.

పరమేశ్వరుని ఆత్మ లింగాన్ని తపస్సు తో పొంది, బల గర్వం తో సామాన్యులని, దేవతలని పీడిస్తున్న తారకాసురుడు - స్వామి కుమారుడు అయిన కుమార స్వామి చేతిలో మాత్రమే మరణం పొందాలి. కుమార స్వామి ఎంత నైపుణ్యం తో యుద్ధం చేసినా స్వామి ఆత్మ లింగాన్ని మెడ లో మాల గా ధరించిన తారకుడు అజేయం గా నిలుస్తున్నాడు. ఆత్మ లింగాన్ని ముక్కలు చేసి అప్పుడు కానీ తారకుడిని సంహరించలేను అని గ్రహించాడు కుమార స్వామి. ఆత్మ లింగాన్ని ముక్కలు చేసిన వెంటనే అవి ఎక్కడ పడ్డాయో అక్కడే వెంటనే ప్రతిష్టించబడాలి. 

అమరావతి - బాల చాముండేశ్వరీ  సమేత అమరేశ్వర స్వామి ప్రతిష్ట ఇంద్రుని ద్వారా,
దాక్షారామ - మాణిక్యాంబా  సమేత భీమేశ్వర స్వామి ప్రతిష్ట సూర్యుని ద్వారా,
భీమవరం - రాజ రాజేశ్వరీ  సమేత సోమేశ్వర స్వామి ప్రతిష్ట చంద్రుడి ద్వారా,
పాలకొల్లు - పార్వతీ సమేత క్షీరా రామలింగేశ్వర స్వామి ప్రతిష్ట విష్ణు మూర్తి ద్వారా,
సామర్లకోట - బాలా త్రిపుర సుందరీ సమేత భీమేశ్వర స్వామి ప్రతిష్ట కుమార స్వామి ద్వారా జరిగాయి.

అలా తారకాసుర సంహారం లోకుల కష్టాలని దూరం చెయ్యడమే కాక, పంచారామాల రూపం లో లోక శాంతి కళ్యాణాల కారకమైన ఐదు దివ్య క్షేత్రాల ఆవిర్భావానికి నాంది పలికింది.


పచ్చని కొబ్బరి తోటలు, వరి పొలాల మధ్య ఠీవి గా నిలబడి ఉంది సామర్లకోట కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయం. ప్రతి అణువు లోనూ ప్రాచీన శోభ, పవిత్రత నిండిన భూమి అది. క్షేత్ర పాలకుడు కాల భైరవుడు ప్రేమ గా పలకరించాడు. అక్కడ కోనేరు లో జలం  తీసుకుని వచ్చి చెట్టు కింద ఉన్న లింగానికి అభిషేకం చేశాము. ఈ చరా చర ప్రకృతి మొత్తం శివమయం. ఆరుబయట ఆకాశం చేత అభిషేకించ పడుతున్న స్వామి ని నేను క్షణ కాలం పాటు మేఘం లా మారి అభిషేకిస్తున్న అనుభూతి కలిగింది.



సామర్లకోట గుడి ఆవరణ లో స్వామి కి చాలా ఇష్టమైన తుమ్మి పూలు ఉంటాయి. స్వామి వారు రెండు అంతస్తులలో కొలువు తీరారు. కింద అంతస్తులో పానపట్టాన్ని, శివ లింగం ప్రారంభ భాగాన్ని దర్శించాము. శివ లింగం సాక్షాత్ అర్థ నారీశ్వర తత్త్వానికి ప్రతీక -  పానపట్టం అమ్మవారి స్వరూపం లింగం అయ్యవారి స్వరూపం. పైన అంతస్తు లో ఉన్న లింగాన్ని దర్శించడానికి వెళ్ళే మార్గం లో, గుజ్జు రూపం తో బొజ్జ గణపతి ముద్దులు చిందిస్తున్నాడు - అమ్మ నాన్నల దగ్గర పిల్లల గారానికి కొదవ ఏమి ఉంది ?

పంచ అమృతాలతో, నీటితో, వట్టి వేళ్ళ తో, గంధం మొదలైన సుగంధ ద్రవ్యాలతో చేసే శివ అభిషేకం లోకానికి శాంతి కారకం. అభిషేక శోభ లో ఆ తెల్లని స్ఫటిక లింగాన్ని చూసి మనసు అవ్యక్తమైన శాంతి ని పొందింది. మందారాలు, నూరు వరహాలు, శివ లింగ పుష్పాలతో, మారేడు దళాలతో అలంకరించ బడిన స్వామి - అప్పుడే లోకం లో అడుగు పెట్టిన శిశువు తనకు అన్ని విధాల ఆధారమైన అమ్మ ని కళ్ళు విప్పార్చి చూడగా ఎంత అందం గా ఉంటుందో, భీమేశ్వరుడు అంత అందం గా ఉన్నాడు.

ఆ గుడి ఆవరణ లోనే కోటి చంద్రుల చల్ల దనాలని తన చూపు లో నింపుకున్న బాలా త్రిపుర సుందరీ దేవి కొలువై ఉంది, అమ్మ వారి ముందు రాతి మీద శ్రీ చక్రం ప్రతిష్టించబడి ఉంది, అక్కడ కుంకుమ పూజలు జరుగుతున్నాయి. స్వామి గుడి కి వెనుక భాగం లో ఈ క్షేత్రం లో లింగాన్ని ప్రతిష్టించిన కుమార స్వామి ఆలయం ఉంది. అక్కడ కూడా దర్శనం అయ్యాక ఆ గుడి లో జరుగుతున్న అన్నదానం లో తృప్తి గా భోజనం చేశాము. అమ్మ బాలా త్రిపుర సుందరీ దేవి గుడి కి వచ్చే బిడ్డల కోసం - రుచి గా, శుచి గా, కడుపు నిండుగా, ఆప్యాయం గా ఇచ్చిన ప్రసాదం అది.

అక్కడి నుంచి - పాద గయా క్షేత్రం - స్వయం భూ కుక్కుటేశ్వర స్వామి క్షేత్రం -   పురుహూతికా మాత శక్తి పీఠం - స్వయంభూ దత్తాత్రేయ స్వామి క్షేత్రం - దత్తాత్రేయ గురు పరంపర లోని శ్రీ పాద వల్లభ స్వామి జన్మ స్థలం - పంచ మాధవ క్షేత్రాలలో ఒక్కటి అయిన కుంతీ మాధవ స్వామి క్షేత్రం - ఎన్నో విశిష్టతలు కలబోసుకున్న పిఠాపురానికి వెళ్ళాము.

Monday, October 8, 2012

తమాసోమా జ్యోతిర్గమయా

ప్రతి మనిషికీ తనది అయిన ఒక ఆలోచనా ధోరణి ఉంటుంది. తనది అయిన ఒక సంస్కారం ఉంటుంది. దానిని బట్టే ఆ వ్యక్తి మంచి చెడులు భావన చేస్తూ ఉంటాడు.

ఏ ఇద్దరు వ్యక్తుల విలువలూ ఒకేలా ఉండవు. ఇక్కడే విపరీతమైన ఘర్షణ మొదలవుతుంది. ఈ ఘర్షణ పెరిగి పెరిగి - ఒక వ్యక్తి మంచి ఇంకొక వ్యక్తి చెడు గా మారే స్థాయి కి చేరుతుంది.

కానీ మనుషుల వ్యక్తిగత ఇష్టాలు అయిష్టాల కన్నా ఉన్నతమైన స్థాయి లో, మనిషి జీవితం ఎలా ఉండాలి, సంబంధాలు ఎలా ఉండాలి, సాంఘిక జీవితం ఎలా ఉండాలి, రాజ్యం ఎలా ఉండాలి - ఈ విషయాలు అన్నీ వాటికి కావాల్సిన విజ్ఞానం తో సహా మన వేదాల్లో పొందు పరచబడ్డాయి - మతాలకు, ధర్మాలకు అతీతంగా.  అతి సమస్యాత్మక సందర్భాలలో కూడా విజ్ఞతతో ఎలా ముందుకు వెళ్ళాలో స్పష్టం గా వేదాలలో చెప్పబడింది.

ఈ విశ్వం లో పుట్టిన ప్రతి  జీవి సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించడానికి, తన జీవిత పరమార్ధాన్ని తెలుసుకోవడానికి, పరమాత్మ ని చేరుకోవడానికి కావాల్సిన అన్ని వనరులని ప్రకృతి ఆ జీవి పుట్టిన నాడే సిద్ధం చేసి ఉంచుతుందట ! జీవికి - ముఖ్యం గా మనిషి కి పరమాత్మ దత్తమైన స్వేచ్ఛ ఉంటుంది. దానిని ఆ వ్యక్తి ఎంత సద్వినియోగం చేసుకుంటాడు అన్న విషయం మీదే ఆ వ్యక్తి చైతన్య స్థాయి ఏర్పడి ఉంటుంది. ఆ చైతన్య స్థాయి ని బట్టి ఆ మనిషి ఆలోచన, ప్రవర్తన ఉంటాయి. వ్యక్తుల లోని ఈ చైతన్య స్థాయిలలో తేడాలు, ఆ తేడాలని అంగీకరించలేని వ్యక్తులు - ఈ ప్రపంచం లోని అన్ని సంఘర్షణలకు, ఘర్షణలకు కారణం. 

నేటి కాలం లో ప్రతి మనిషి మనిషి కీ మధ్య పెద్ద పెద్ద అడ్డు గోడలు; ప్రేమ, అభిమానం పంచుకోవడానికి వీలు లేనంత మందమైన అడ్డు గోడలు. ఆహారం లో మార్పు, జీవన విధానం లో మార్పు, సాంఘిక జీవనం లో మార్పు, కుటుంబ జీవనం లో మార్పు. అన్ని రకాల రుగ్మతలకి మందు లా పని చేసే ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని మన చేతులతో మనమే నాశనం చేసుకున్నాం. చిన్న పిల్లలని సంరక్షణా కేంద్రాల పాలు చేశాము, పెద్ద వాళ్ళని వృద్ధాశ్రమాల పాలు చేశాము,  వైవాహిక జీవన ఔన్నత్యాన్ని ఒత్తిళ్ళు అహంకారాల కింద ఉంచేశాము, అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములను పిలుపుకి అందనంత దూరం లో పెట్టాము, భగవంతుడి దగ్గర సహేతుకం కాని కాని కోరికలకి కూడా బేరం పెట్టాలని చూశాము - మొత్తం గా ధార్మికం గా పేదరికం అనుభవిస్తున్నాం. మనిషి ని దైవ స్వరూపం గా మార్చే సుగుణాలు - ప్రేమ, దయ, కరుణ, క్షమ  - అన్నీ వదిలి బ్రతుకుతున్నాము.

క్షమ - ఉత్కృష్టమైన సుగుణం. మన భారతీయ ఆధ్యాత్మిక జీవనానికి ఆభరణం. క్షమ లేని ఆధ్యాత్మిక సాధన జీవం లేని శరీరం లాంటిది.

అలాగే ఆధ్యాత్మిక జీవనం కుటుంబ, సాంఘిక జీవనాలకు భిన్నమైనది కాదు - అది వాటితో మమేకమయ్యే అంతర్లీన ప్రవాహం.


ఆధ్యాత్మిక సాధన అనేది జీవితం లో అన్ని దశలు దాటిన తర్వాత ఆలోచించాల్సిన దశ కాదు. మనిషి పుట్టుక నుంచీ జీవితపు చివరి క్షణం దాకా ప్రతి దశ లోనూ మార్గదర్శకం గా నిలిచే జ్ఞానం అది. ఈ విషయాన్ని అర్థంచేసుకోవడం లో నేటి మనుషులు విఫలం అవుతున్నారు. వారు జీవితాన్ని దిద్దుకోలేక, తరువాత తరాలకు ఆ జ్ఞానాన్ని, వారసత్వాన్ని అందించలేక - పొరపాటు మీద పొరపాటు చేస్తున్నారు.

అందుకే నేటి మనిషి క్రూరం గా మారిపోయాడు. తన ఇష్టానికి వ్యతిరేకం గా జరిగే దేనినీ తట్టుకోలేనంత అసహనం పెరిగింది. తన చుట్టూ ఇనుప గోడలు కట్టుకుంటున్నాడు. త్యాగం లో ఉండే ఆనందం పూర్తిగా మర్చిపోయాడు. తనకి అనుకూలం గా లేని మనుషుల మీద, పరిస్థితుల మీద అంతు లేని ద్వేషాన్ని పెంచుకుంటున్నాడు, ఆ ద్వేషమే శ్వాస లాగ బ్రతుకుతున్నాడు. దైవంతో తనకున్న అత్యున్నతమైన బంధాన్ని పదిల పరుచుకునే అవకాశాలని విస్మరిస్తున్నాడు. ఆత్మోన్నతి కోసం సాధన చెయ్యాల్సిన అవసరాన్ని మరచిపోతున్నాడు. ఒక్క మాటలో - మనిషి మనిషిలా బ్రతకడం లేదు.

ఎదుటి వారి ప్రవర్తన మనలని బాధ పెడితే స్పష్టం గా చెప్పాలి... మన వైపు నుంచి ఏమన్నా పొరపాటు ఉంటే మనను మనం దిద్దుకోవాలి. మంచి ని మంచి గా ఆదరించాలి, చెడు ని వ్యతిరేకించాలి, కాని ఆ వ్యతిరేకించడం లో క్రూరత్వం ఉండకుండా ప్రవర్తించాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా మారలేని మనుషులను ద్వేషించకుండా, ఆ మనుషుల చైతన్య స్థాయిలను మనం అర్థం చేసుకోవాలి. వారికి మేలు జరగాలని, మానసికం గా పరిణితి చెందాలని దేవుడిని స్వచ్చమైన మనసుతో ప్రార్థించాలి.


తల్లికి అందరు బిడ్డలు సమానం అయినా కూడా, ఏదైనా లోపం ఉన్న బిడ్డని ఎక్కువ గా ఆదరించినట్టు - అజ్ఞానం వలన మనలను బాధించే వారు ఆ అజ్ఞానం నుంచి బయట పడాలని వారి కోసం మనం ఎక్కువ గా ప్రార్థించాలి.
మన జీవితం అంటే కేవలం మనమే కాదు, మన చుట్టూ ఉన్న అన్ని మంచి చెడుల కలయిక. 

ఇది అంతా ఒక విషయం లాగ చెప్పుకోవడానికి బాగుంటుంది కాని దీన్ని ఆచరించి చూపించడం చాలా చాలా కష్టం. ముఖ్యం గా మన సాత్విక ఆలోచనని ఎదుటి మనిషి అశక్తత గానో, అనివార్యం గానో భావిస్తే మన సహనానికి అది నిజమైన పరీక్ష అవుతుంది. ఆత్మ రక్షణ కి, ఆత్మ విశ్వాసానికి ఉన్న అంతరం చాల చిన్నది, సన్నది. సరి అయిన సమయం లో, సరి అయిన తీరులో, సరి అయిన దృక్పధం తో ముందుకు వెళ్ళడం అనేది సామాన్యమైన విషయం కాదు, చాలా చాలా సాధన కావాలి, పరిణితి కావాలి, ఓర్పు కావాలి; అన్నిటి కన్నా ఎక్కువ గా మనస్సు ని, శరీరాన్ని, ఆత్మ ని సంయమనం తో ముందుకి నడపడానికి దైవ బలంకావాలి.

పరమేశ్వరా ! ఆ బుద్ది నీ, పరిణితి నీ,విచక్షణ నీ అందరికీ ప్రసాదించు.

ద్వేషాన్ని ప్రేమ తోనూ, చీకటి ని వెలుగు తోనూ, అజ్ఞానాన్ని జ్ఞాన జ్యోతి తోనూ జయించగల సాధన ని ప్రసాదించు.

అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ ...

Thursday, September 20, 2012

ఆది శక్త్యాత్మిక అన్న పూర్ణ

అన్నం పరబ్రహ్మ స్వరూపం.

అన్నం లో ప్రాణ శక్తి ఉంది.

అన్నం సాక్షాత్ అమ్మవారి స్వరూపం.

ప్రపంచం లో అన్ని ఉపాధుల జీవనోపాధులకి మూలం అన్నం.

ఇది నేను పెద్ద వారి నుంచి విన్న మాట !  మనకి ఆకలి వేళకి ఎవరన్నా ఎదురొచ్చి శుచి గా వండిన ఆహారాన్ని  పెడతానంటే ఎటువంటి ఆహంకారం  లేకుండా ఆనందం గా, తృప్తి గా ఆ భోజనాన్ని అంగీకరించాలి. సాక్షాత్ కాశీ అన్నపూర్ణేశ్వరి ఆ మనిషి రూపం లో మనకి అన్నం పెడుతున్నట్టు అర్థం.

ఒక వ్యక్తి కి పది లక్షలు ఉంటే కోటి రూపాయలు లేవని బాధ ఉండొచ్చు. ఒక వ్యక్తి కి తల దాచుకునేందుకు ఒక ఇల్లు ఉన్నాక ఇంకో పెద్ద ఇల్లు కావాలన్న ఆశ రావచ్చు. ఆకలి తో ఉన్న మనిషికి అన్నం పెడితే - కడుపు నిండితే చాలు - తృప్తి వస్తుంది.

సాధ్యమైనంత  వరకు "అన్నం వద్దు " అనే మాట కానీ ఆలోచన కానీ ఎవరికీ ఉండకూడదు. అన్నాన్ని ఏ నాడూ అవమానించకూడదు, తిరస్కరించకూడదు.

అన్నిటి కన్నా ముఖ్యం - "అన్నాన్ని ఎన్నడూ వృధా చెయ్యకూడదు"

Tuesday, February 28, 2012

సింహాచలం సంపెంగ

ప్రతి జీవి ఈ భూమి మీద ఏదో ఒక కర్తవ్యాన్ని నిర్వహించేందుకు వస్తుంది. భగవంతుడు ఆ జీవి ని భూమి మీద ప్రాణి గా సృష్టించే ముందు ఆ జీవి ఏ శరీరం లో ప్రవేశించాలి, ఎలా జీవించాలి, తన పూర్వ కర్మల ఫలాన్ని ఎలా అనుభవించాలి, భూమి మీద ఎటువంటి ఈశ్వర దత్తమైన కార్యాన్ని నెరవేర్చాలి, ఎప్పుడు తిరిగి ఈశ్వరుడి సన్నిధి లోకి చేరుకోవాలి - అన్నీ సంకల్పం చేసి పంపుతాడని నా నమ్మకం.

ప్రతి జీవి కి లోలోపల పరమాత్మ వెలిగించిన జ్ఞాన జ్యోతి తో పాటు, తన ఆలోచన వివేకాలని అనుసరించే స్వేచ్ఛ కూడా ఉంటుంది. ఆ స్వాతంత్ర్యాన్ని జీవుడు సద్వినియోగం చేసుకుంటాడా, తను చెప్పిన మార్గం లోనే నడుస్తున్నాడా అని ఆ సర్వ సాక్షి ఈశ్వరుడు గమనిస్తాడట.

మనిషి జన్మ ఎత్తిన వారు ఎవరు తప్పులు చెయ్యకుండా, పొరపాటు పడకుండా ఉండరు. కాని ఆ నీడ నుంచి బయటకు వచ్చి ఈశ్వరుడు లోపల వెలిగించిన జ్ఞాన జ్యోతి ని గుర్తించి తన మార్గం తను వెతుక్కోగలిగిన జీవుడు ధన్యుడు. ఈ లోపు మనిషి ని - కోపం, ద్వేషం, అసూయ, కామం, లోభం, అవమానం, విశ్రున్ఖలత్వం, అహంకారం, మోహం, న్యూనత - అన్నీకలిపి లో లోన కల కలం సృష్టించి జ్ఞాన జ్యోతి ప్రకాశాన్ని లోలోపల అణచి వేసి, ధర్మ బద్ధం గా జీవించనీకుండా అడుగడుగునా అడ్డు పడుతుంటాయి.

ఇది సర్వం మాయ. దీన్ని తెలుసుకుని లోపల విషయాన్ని గ్రహించి ప్రాపంచిక జీవితాన్ని సాధ్యమయినంత తక్కువ గా వికారాలకు లోనవుతూ - భగవంతుని ప్రార్ధన తో ఆ వికారాలని ఒక్కొక్కటి గా జయిస్తూ - ప్రతి క్షణం లో ఈశ్వర సాన్నిధ్యాన్ని అనుభవించ గల స్థితి పొందిన జీవుడు అత్యంత భాగ్య శాలి.

దారుణమైన అజ్ఞానం లో పడి కొట్టుకు పోతున్న ప్రతి జీవుడిని తండ్రి ఈశ్వరుడు సంస్కరించి తన మార్గం లోకి తనే నడిపించడానికి ఎప్పుడూ తన చేయూత ఇస్తూనే ఉంటాడు. వివేకం తో, భక్తితో ఆ తండ్రి చెయ్యి అందుకున్న జీవుడు ధన్యుడు.

లేకపోతే ఎన్నో తప్పులు చేసి, తెలియక కూడా ఎన్నో పాపాలు మూట కట్టుకుని, అహంకారం లో కొట్టు మిట్టాడుతూ ఉన్న నా లాంటి మనిషి ని - నా సింహాచలం అప్పన్న అక్కున ఎలా చేర్చుకున్నాడు ? అది కేవలం ఆయన దయ మాత్రమే ! నా తండ్రి ఆయనే పిలిపించి దర్శనం ఇస్తారు, తప్పు చేస్తే చిన్న మొట్టి కాయలు వేస్తారు, తన పాదాల దగ్గర మేము తల దాచుకోవాలని ఆయనే పిలిచి ఇల్లు ఇచ్చారు.

ప్రతి క్షణం ఎటు వంటి స్థితి లో ఉన్నా కూడా ఈశ్వర సాన్నిధ్యాన్ని అనుభవించడమే జన్మ లో, జన్మ రాహిత్యం లోను ముఖ్య విషయం. ఎప్పుడూ ఆలోచన లలో ఊగిస లాడే చిన్న కోరిక - ఈ సారి జన్మ అంటూ ఉంటే సింహాచలం కొండ మీద అడవి సంపెంగ చెట్టునై పుట్టాలి. ఒక్క సారి అయినా పువ్వుల్లాగా పూసి - నా తండ్రి వరాహ లక్ష్మీ నరసింహ స్వామి మెడలో అలంకరించ బడాలి.

Saturday, February 18, 2012

అష్టా దశ శక్తి పీఠాలు

అష్టా దశ శక్తిపీఠాలు - మన అఖండ భారతా వని చేసుకున్న అనంత పుణ్య ఫలాలు
అమ్మ భూ మండలం లోని తన బిడ్డలందరికీ మరింత చేరువ అయ్యేందుకు తనకు తాను గా వెలిసిన దివ్య క్షేత్రాలు

లంక లో శాంకరీ దేవి
కంచి లో కామాక్షి
ప్రద్యుమ్న దేశం లో శృంఖలా దేవి
క్రౌంచ పట్టణం లో చాముండేశ్వరి
అలంపురం లో జోగులాంబ
శ్రీశైలం లో భ్రమరాంబిక
కొల్హాపురం లో మహా లక్ష్మి
మాహుర్ లో ఏక వీరిక
ఉజ్జయిని లో మహా కాళి
పీఠికా పురం లో పురుహూతికా
ఓడ్యాన దేశం లో గిరిజా దేవి
దక్ష వాటిక లో మాణిక్యాంబ
హరి క్షేత్రం లో కామాఖ్య దేవి
ప్రయాగ లో మాధవేశ్వరి
జ్వాలాముఖి లో వైష్ణవీ దేవి
గయా లో మంగళ గౌరి
వారణాసి లో విశాలాక్షి
కాశ్మీర్ లో సరస్వతి

ఎక్కడ చూసినా అమ్మే ! బిడ్డల ఆలనా పాలనా చూసేందుకు ఎన్నో చోట్ల అన్ని రూపాలలో భూమి మీద అవతరించింది అమ్మ !

ఒక బిడ్డ ని కనడానికి తన ప్రాణాన్ని పణం గా పెట్టి చిన్ని జీవాన్ని ఈ లోకం లోకి తీసుకుని వచ్చి, తన రక్తాన్ని పాలు గా మార్చి , ఆ చిన్న జీవాన్ని సంపూర్ణమైన జీవి గా నిలబెట్టే ప్రతి తల్లి లోను ఆ అమ్మవారి అంశ ఉంది. అమ్మ తనాన్ని అత్యంత పవిత్రం గా భావించే ఈ కర్మ భూమి లో, తల్లి ని మించిన దైవం లేదని వేదాలు సైతం ఘోషించే ఈ పుణ్య భూమి లో పుట్టిన ఏ వ్యక్తి కి అయినా అత్యంత ముక్తి దాయకమైన శక్తి పీఠాలు పద్దెనిమిది మాత్రమే కాదు. ప్రతి వ్యక్తి కీ కని పెంచిన అమ్మ ఒడి అతి పవిత్రమైన శక్తి పీఠం. సాక్షాత్ అమ్మవారి అంశ ని ఈ మట్టి మీద జన్మ ని ఎత్తే ప్రతి ప్రాణి కి అనుభవేకం చేసే అత్యంత గొప్పది అయిన శక్తి పీఠం !!