Amman

Amman
Nitya subha mangalam

Friday, November 22, 2013

శ్రీశైల భ్రమరాంబికా భజ మనః శ్రీ శారదా సేవితాం 2

దాదాపు అయిదు ఆరు సంవత్సరాల తర్వాత శ్రీశైల గ్రామంలో అడుగుపెట్టాము.

రకరకాల రాజకీయ పరిస్థితుల్లో నలిగిపోతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దుస్థితి - తిరుమల, శ్రీశైలం లాంటి క్షేత్రాల మీద తీవ్ర ప్రభావం చూపింది. మరునాడు దసరా ఉత్సవాలకు భక్త జన సంద్రంగా మారాల్సిన క్షేత్రం పెద్దగా జనాలు లేక వెలవెల బోయింది. పరమాత్మకి రాజకీయ హద్దులు నిర్ణయించ ప్రయత్నించిన కొంత మంది మనుషుల అజ్ఞానానికి ఆశ్చర్యం వేసింది. ఇవి అన్నీ పక్కన పెడితే - మాకు అత్యంత వైభవమైన దర్శనం దొరికింది ఈ రద్దీ లేకపోవడం వల్ల - అయ్యవారి దగ్గర, అమ్మవారి దగ్గర కూడా. బహుశా ఈ జన్మకి మరొక సారి ఇంత గొప్ప భాగ్యం మాకు మళ్లీ దక్కకపోవచ్చు అన్నంత గొప్పగా.


ఆలయంలో అడుగుపెట్టే ప్రతి భక్తుడి నుదుటన విభూది బొట్టు పెట్టే ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. విభూది సర్వ పాప హరమ్, ఐశ్వర్య ప్రదాయకం. మనసుకి, శరీరానికి ఆరోగ్య దాయకం, శీతల ప్రదాయకం. సదా స్వామి వారి దర్శన భాగ్యాన్ని అనుభవిస్తున్న శనగల బసవన్నని బసవన్న మంటపంలో దర్శించి, వీర శైవ మంటపాన్ని దాటి, శివ నామ స్మరణలో మునిగి తేలుతూ మల్లికార్జున స్వామిని చేరాము. జీవితంలో మొదటిసారి స్వామి స్పర్శ దర్శనం లభించింది. నున్నటి చల్లటి లింగానికి తల తాటించి పునీతమయ్యాను. ఆణువణువూ శివమయం. ఆ క్షణం అక్కడ ఉన్నది మురళి అన్న పేరు ఉన్న నేను కాదు అని నాకు అనిపించిది.



బయటికి వచ్చి స్వర్ణ కాంతుల ఆలయ శిఖరానికి నమస్కరించాను. స్వామి చుట్టూరా కొలువై ఉన్న - అర్థనారీశ్వర ఆలయం, వీరభద్ర స్వామి ఆలయం, వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయం, ద్రౌపదీ పాండవ ప్రతిష్టిత శివ లింగాలు, పంచ భూత లింగాలు, రామ ప్రతిష్టిత సహస్ర లింగం, మల్లమ్మ ఆలయం, కుమార స్వామి ఆలయం (ఆయనే శ్రీశైల క్షేత్రంలో స్వామి అమ్మ వారల నివాసానికి కారకుడు), అక్క మహా దేవి ఆలయం, రాజ రాజేశ్వర స్వామి - రాజ రాజేశ్వర దేవి ఆలయం, దత్తాత్రేయుడు తపస్సు చేసిన రావి  చెట్టుని దర్శించాము. మల్లికార్జున స్వామి అభిషేకం కోసం నీటిని ఇచ్చే మల్లికా గుండం (ఇక్కడే సరస్వతీ నది అంతర్వాహిని గా ఉంది) స్వామి గర్భ గుడి నుంచి బయటకు వచ్చే మార్గం దగ్గరలో ఉంది. ఆ మల్లికా గుండం దగ్గర ఒక ప్రత్యేకమైన స్థలంలో నిలబడి నీటిలో శ్రీశైల స్వామి వారి ఆలయ శిఖరాన్ని దర్శించాము.

శ్రీశైలంతో నాకున్న అనుబంధం ఇప్పటిది కాదు, నా ఈ భౌతికమైన ఆలోచనతో నేను తెలుసుకోలేని అనుబంధం ఏదో నాకు అక్కడ ఉన్నది అని అనిపిస్తోంది. చలికాలపు లేత నీరెండలో శ్రీశైల దేవాలయ ప్రాంగణమంతా బంగారు వన్నెలో ప్రకాశిస్తోంది. అక్కడ నుంచి మెట్లు ఎక్కి అమ్మ భ్రమరాంబిక ఆలయంలో అడుగు పెట్టాము. నా శరీరం నెమ్మదిగా నడుస్తోంది కాని నా నా మనసు, నా ఆత్మ అమ్మ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి, చాల సేపటి నుంచి.



అమ్మని ఎంత సేపు చూస్తే మాత్రం మనసుకి తృప్తి ? తేజోమయమైన అమ్మ రూపం లేత నీరెండలో మరింత ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ ఉంటే మనసుకి వేరే ధ్యాస ఎందుకు ఉంటుంది ?  అమ్మ చిన్న విగ్రహ రూపంలో ప్రకాశిస్తూ కనిపిస్తున్నా సమస్త విశ్వానికి పాలకురాలు ఆమె. కొద్ది సేపు అంత పెద్ద అమ్మకి నేను బిడ్డని అని గర్విస్తున్నాను,మరి కొద్ది సేపు అంత చిన్న విగ్రహ రూపంలో ఇమిడిపోయిన అమ్మ నాకు పసి బిడ్డ అయ్యి నా ఒడిలో పడుకున్న భావన. ఆనందం కాదు, ఉద్వేగం కాదు, భయం కాదు, ఉత్సాహం కాదు - ఒక నిర్మలమైన, నిశ్చలమైన భావం. భౌతికంగా ఎలా ఉన్నా ఆత్మ లోలోపల పొందే బ్రహ్మానందం అది.

అంత గొప్ప అష్టాదశ శక్తి క్షేత్రంలో నా సొంత గుడిలో కూర్చున్నంత స్వతంత్రంగా అమ్మని చూస్తూ, అమ్మ నామాలు చదువుకుంటూ మహదానందాన్ని అనుభవించాను. స్వామి మల్లికార్జునుడు, అమ్మ  భ్రమరాంబిక అలా మమ్మల్ని ఆ మూడు రోజులు దివ్యమైన, ఆప్తమైన దర్శనాన్ని ఇచ్చి మా జీవితాన్ని సుసంపన్నం చేశారు.

రెండవ రోజున నా పుట్టిన రోజు నాడు (నిజం గా నేను పుట్టిన రోజు గొప్ప విశేషమా? ఏదో ఒక నెపంతో అమ్మవారి దగ్గర, అయ్యవారి దగ్గర ఎక్కువ రోజులు గడపాలనేదే నా తపన) స్వామి కి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేసుకునే భాగ్యం మాకు దక్కింది. అంటే కాదు, అమ్మ గోమాత గా శ్రీశైల మల్లికార్జున దేవాలయం పక్కన తిరుగుతూ మాకు గోపూజ రూపంలో తనని సేవించుకునే సంకల్పాన్ని, అదృష్టాన్ని ఇచ్చింది. మా మనస్సులో దివ్య జ్యోతులు వెలిగించింది అమ్మ. దేవాలయ ప్రాంగణంలో జమ్మి చెట్టు దగ్గర, పంచ భూత లింగాల దగ్గర జ్యోతులు వెలిగించాము.

ఆ రోజు సాయంత్రం  శైలపుత్రి అలంకారంలో దసరా తొలి రోజు ఉత్సవాలు జరుగుతున్నాయి అమ్మకి. ఆ వైభవం, ఆ శోభ చూడడానికి రెండు కన్నులు చాలవు, సముద్రమంత సంతోషాన్ని ఇముడ్చుకోగల బలమైన గుండె కావాలి. మల్లికార్జున స్వామి పక్కన భ్రమరాంబిక గా ఒక పూల పల్లకిలో - శైలపుత్రిగా మరొక పూల పల్లకిలో అమ్మ పూజలు అందుకుంటోంది. ఆ పువ్వులు, అక్షతలు, మంత్రాలు, అందరిలో వెల్లువెత్తిన ఆధ్యాత్మిక సౌరభం - ఈ శోభని మేము చూసేందుకే అమ్మవారు మమ్మల్ని ఈ సమయంలో రప్పించుకుంది అనిపించింది. అమ్మవారు, అయ్యవారు  అలా శ్రీశైల పుర వీధుల్లో విహారానికి వెళ్ళగానే మేము కళ్యాణ మంటపానికి చేరుకున్నాము - నిత్యకళ్యాణం కోసం. ఎంత మంది దంపతులు ఆ కల్యాణంలో ఉన్నారో - అక్కడ ప్రతి ఒక్క మగ వాడు హిమవంతుడి స్వరూపమే, వారి ధర్మ పత్ని మేనకా దేవి స్వరూపమే. ఎదురుగా మల్లికార్జున భ్రమరాంబికా కళ్యాణ మూర్తులు, వారి మధ్యలో బాల కుమార స్వామి. కల్యాణం అత్యంత వైభోగం గా జరిగింది. కళ్యాణ సేవలో ఉన్న ప్రతి దంపతుల చేతికి వధూ వరుల బాసికాలు తాకించారు, మంగళ సూత్రాన్నితాకి నమస్కరించుకునే అవకాశం ఇచ్చారు. కల్యాణం అత్యంత వైభవం గా జరిగింది. అమ్మవారికి అయ్యవారు తాళి కట్టారు.  నా కళ్ళలో సన్నటి కన్నీటి పొర - వాళ్ళు ఆది దంపతులు, సమస్త విశ్వానికి జననీ జనకులు అని నాకు తెలుసు - కానీ, ఆ క్షణం నా కూతురు భ్రమరాంబికని స్వామి మల్లికార్జునుడికి ఇచ్చి వివాహం చేసిన ఆనందమే నాలో విహరిస్తోంది, నన్ను ఉద్వేగంలో ఒక క్షణం కుదిపేసింది. కళ్యాణ ప్రసాదం తీసుకుని బయటకు వచ్చాము. ఆది దంపతుల కల్యాణానికి లోకం, ప్రకృతి అంతా మురిసిపోయినట్టుగా వర్షం పడుతోంది. మనసు నిండిన అనుభూతితో గుడి నుంచి బయటకు వస్తుంటే, స్వామి అమ్మవార్లు ఊరేగింపు అయ్యి వెనక్కి వస్తున్నారు. పల్లకీలు అద్భుతంగా, పెద్దగా, కళగా ఉన్నాయి. మోసేవారు ఒక యజ్ఞం లాగ మోస్తూ పరవశంలో మునిగిపోయి ఉన్నారు. నా మనసు నా స్వాధీనంలోకి వచ్చింది. వారు సమస్త విశ్వానికి జననీ జనకులు అనే సత్యం నా వివేకంలోకి ప్రసరించి - నా పితృ భావన మొత్తం తగ్గి - నేను తిరిగి అమ్మ బిడ్డడిని అయ్యాను.

మరుసటి రోజు అమ్మవారిని, అయ్యవారిని దర్శించాక ఇష్ట కామేశ్వరి అమ్మవారి గుడికి వెళ్లాలని సంకల్పం చేశాము, వాహనం కూడా ఎక్కాము. నా మనసుకి ఉద్వేగం బాగా ఎక్కువయ్యింది, ఇష్ట కామేశ్వరి అమ్మవారిని చూసి,అమ్మ నుదుటిని స్పర్శించే క్షణం ఉత్పన్నమయ్యే ఉద్వేగానికి నేను ఏమి అవుతానో కదా అనుకుంటున్నాను. కానీ ఇష్ట కామేశ్వరి అమ్మ మమ్మల్ని ఇంకొక సారి రమ్మని, ఇప్పటికి హైదరాబాద్ తిరిగి వెళ్ళమని మా మనసులో దూరి చెప్పింది. తిరిగి హైదరాబాద్ కి ప్రయాణం అయ్యాము ఒకింత నిరాశతో.



సామానులు తీసుకుని కారులో పెడుతుంటే సొంత ఊరు ఖాళి చేస్తున్నంత బాధగా ఉంది. దారిలో సాక్షి గణపతి గుడి దగ్గర ఒక క్షణం ఆగి తిరిగి మా జనారణ్యం వైపు ప్రయాణం అయ్యాము. కారు ఒక్కొక్క ఊరు దాటుకుంటూ నల్లమల అడవిలో గుండా బయటికి వస్తూ ఉంటే - నాకు అత్యంత ప్రియమైన దాన్ని నా చేతి నుంచి ఎవరో బలవంతంగా దూరం చేస్తున్నట్టుగా ఉంది. మనసు కెలికినట్టుగా ఉంది. తరువాత రోజు నుంచి మొదలయ్యే నా దైనందిన జీవితం ఆ క్షణం లో నాకు చాలా అప్రియంగా తోచింది. కారు ఇల్లు చేరింది కానీ నా మనసు శ్రీశైల స్వామి వారి గుడి పక్కన, అమ్మవారి గుడి దారిలో మెట్లపై చిక్కుకుని అటు స్వామికి, ఇటు అమ్మకి మధ్యగా ఉండిపోయింది. అక్కడ చెట్టు కొమ్మ మీద కోతిలానో, గువ్వ లానో కూర్చుండి కదలడం లేదు.  అక్కడ చెట్టుగానో, పుట్టగానో ఉండి  ఉంటే అమ్మవారిని నిత్యం చూసుకుంటూ ఆ ఆనందంలో శాశ్వతంగా నిలిచిపోయే వాడిని కదా - అని బాధ పడ్డాను. ఈ బాధ ఎలా తీరుతుంది తెలియక చాల సేపు గిలగిలలాడాను.

ఇంట్లో అమ్మవారి ముందు కూర్చుని దీపారాధన చేస్తున్నాము - ఎలా ప్రవేశించిందో తెలియదు కానీ నా మనసులో ఒక ఊరట ప్రవేశించింది. నా ఆలోచన నాతొ ఇలా పలికింది - "ఎందుకు బాధ పడుతున్నావ్ ? మురళీ భరద్వాజ అని ఇప్పుడు పిలవబడుతున్న నువ్వు అసలైన నువ్వు కాదేమో ! అంత కన్నా శాశ్వతమైనది ఒకటి నీ శరీరాన్ని,మనసుని ఆక్రమించుకుని ఉంది. అది ఎక్కడిది అనుకుంటున్నావ్ ? శ్రీశైల భ్రమరాంబిక అమ్మ దగ్గరే శాశ్వతంగా నివాసం ఉండి ఉండేదేమో ! అందుకే ఈ ఎడబాటు ఇంత బాధ పెడుతూ ఉందేమో ! బంధనాలు తీరాక ఏదో ఒక రోజు అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి చేరాల్సిందే. ఈ శరీరంతో నువ్వు ఎక్కడ తిరిగినా, ఎక్కడ ఉన్నా - చివరికి ఆ శాశ్వతమైనది అక్కడికి చేరుకుంటుంది. ఈ బిడ్డ ఆ అమ్మ ఒడిని తప్పక చేరుతుంది"

మనసు దూదిపింజలా తేలిక అయ్యింది, లోలోపల ఒక జ్యోతి వెలిగి క్రమంగా నా లోపల వెలుగు నింపుతున్న  భావన కలిగింది.లేచి నా దైనందిన జీవితంలోకి ఆనందంగా వెళ్ళిపోయాను.

                                శ్రీశైల భ్రమరాంబికా భజ మనః శ్రీ శారదా సేవితాం

Thursday, October 17, 2013

శ్రీశైల భ్రమరాంబికా భజ మనః శ్రీ శారదా సేవితాం 1

శ్రీశైలం - నాకు తెలియకుండానే నన్ను అమ్మవారి ధ్యాస వైపు నడిపించి నా జీవితంలో వెలుగులు నింపిన అతి పవిత్రమైన ప్రదేశం.

భౌతికంగా శ్రీశైలం చూడక ముందు కూడా అది నాకెంతో సుపరిచితమైన ప్రదేశంగా తోచేది. నేను తప్పకుండా శోధించి తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం / రహస్యం ఏదో శ్రీశైలంలో ఉన్నట్టు ఒక అస్పష్టమైన ఊహ నా మనసులో ఉండేది. పెళ్లి అయిన కొత్తలో తొలిసారి ప్రాపంచికమైన మేలు ఆశించి శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టాను. నా  జీవితంలో శుభం, నా సంతానం - ఇవన్నీ శ్రీశైల క్షేత్ర దర్శనం తర్వాత నాకు కలిగిన గొప్ప భాగ్యాలు.



కానీ, వీటి అన్నిటి కన్నా భిన్నం అయినది, నా జీవన గమనాన్నే మార్చేది అయిన ఒక పెద్ద మార్పుకి బీజం శ్రీశైల క్షేత్రంలోనే పడింది. అది నాలో కొన్నాళ్ళు నిద్రాణమై చివరికి నా ఆత్మని మేలుకొలిపి - పరమాత్మ (అమ్మవారు) లో లీనం అవడానికి అడుగులు వెయ్యమని గొప్ప ప్రేరణనిచ్చింది.

నేటికీ లౌకికమైన జీవితంలో తలమునకలు అవుతూ అరిషడ్వర్గాలతో పోరాడుతూ - పాప పంకిలమైన మనసుతో, వాక్కుతో జీవిస్తూ ఉన్నా సరే, ఇంకా ఏదో ఒక మూల నన్ను నేను ఉద్ధరించుకోమనే ప్రేరణను బలంగా నిలిపి నాలో జ్యోతిని నిరంతరం వెలిగిస్తోంది నా అమ్మ - భ్రమరాంబిక. నా సామాన్య జ్ఞానానికి అంతు చిక్కని మల్లికార్జున స్వామివారి తత్వాన్ని అణువంత అయినా అర్థం చేసుకోవడానికి నన్ను సంసిద్ధ పరుస్తూ, నన్ను ఒడిలో కూర్చుండబెట్టుకుని జ్ఞాన భిక్ష అనుగ్రహించబడేలా నన్నుసిద్ధం చేస్తోంది మా అమ్మ భ్రమరాంబ.

అమ్మ నా ప్రాణం, అమ్మ నా లోకం.

ఇరవై ఆరేళ్ళు కన్నూ మిన్నూ కానకుండా అహంకారంగా తిరిగి, అమ్మ ధ్యాస ఏ మాత్రం లేకుండా మెలిగి - అనేక పాపాలు పోగు చేసుకుని కూర్చున్న నాకు - జీవితం అంటే ఏమిటి, జీవిత పరమావధి ఏమిటి అని అర్థం చేసుకోమనే ధ్యాస ఇచ్చింది నా జనని శైలపుత్రి. అంత వరకు నేను జీవించిన జీవితంలో పెద్ద రుచి లేదు అనిపించింది. నిజమైన ఆత్మానందం కోసం నా అన్వేషణ అలా మొదలయ్యింది.

తొలిసారి శ్రీశైల యాత్రలో అమ్మవారి ధ్యాస లేదు. తరువాత రోజుల్లో అమ్మవారి ధ్యాస మొదలైన దగ్గరి నుంచీ, శ్రీశైలం వెళ్లాలని  లోలోపల సంకల్పం చేసుకున్నా అయిదు సంవత్సరాల పాటు వెళ్ళలేకపోయాను - రకరకాల కారణాల వల్ల. మనసు ఎంతో పరితపించింది. నా వైష్ణవిని తీసుకు వెళ్లి అమ్మ ముందు నిలిపి - "అమ్మా! ఇదుగో నీ వర ప్రసాదం" అని చెప్పాలి అని చాలా సార్లు అనిపించింది. ఆ కోరిక తీరే రోజు దగ్గరకొచ్చింది. నా పుట్టినరోజు నెపంతో తీరిక చేసుకుని శ్రీశైలం వెళ్ళే ఏర్పాట్లు చేసుకున్నాం. మరీ ఎక్కువ ఆశ పడితే తర్వాత ఆశా భంగం అవుతుందేమో అని చాలా మనసుని అదుపులో పెట్టుకున్నాను (అని అనుకున్నాను). ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్మవారిని, అయ్యవారిని చూడబోతున్నాను అన్న ఊహ నన్ను పట్టి కుదిపేసింది ఆనంద ఉద్వేగాలతో.




నాకు నల్లమల అరణ్యం మొత్తం శ్రీశైలం క్షేత్రం అని అనిపిస్తుంది. ఆ అరణ్యంలో జంతుజాలం, మనుషులు, చెట్టు, పుట్ట - అన్నీ పరమ పవిత్రం. నల్లమల అరణ్యం మొత్తం శివ శివానీ మయమ్. సామాన్యుల కంటికి కనిపించకుండా అనేక యోగులు, సిద్ధులు ఆ అరణ్యంలో స్వామి, అమ్మవార్ల గురించి తపస్సులో మునిగిపోయి ఉంటారట.  అరణ్య ముఖద్వారం అయిన మన్ననూరు చెక్ పోస్ట్ ని ఉదయం ఆరు గంటలకు దాటిన దగ్గర నుంచి దట్టమైన నల్లమలలో ఉత్సాహ భరితమైన ప్రయాణం. నెమళ్ళు, కోతులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. దట్టమైన పొదల మాటు నుంచి జింక బయటికి వచ్చి పలకరించి పొదల్లోకి జారుకుంది. అలా గంట గడిచాక శ్రీశైల పర్వత తొట్టతొలి దర్శనం అయ్యింది.

అసలు శ్రీ పర్వతమే ఒక సంపూర్ణమైన శివ లింగ స్వరూపం. శ్రీశైలం గ్రామం ఉన్న ఆ పర్వతం పై భాగమే పానపట్టం (సాక్షాత్ అమ్మవారు), ఊరి మధ్యలో స్వామి గుడి లింగ స్వరూపం (సాక్షాత్ అయ్యవారు). పాతాళ గంగకి వెళ్ళే మెట్ల మార్గమే అభిషేక జలం లింగం నుంచి కిందకి జాలువారే మార్గం. స్వామి లింగ స్వరూపం మీద నుంచి జాలువారి ప్రవహించిన అభిషేక జలమే ఆ కృష్ణవేణమ్మ. శ్రీశైలం అణువు అణువు శివ స్వరూపం. శ్రీశైల దేవాలయం చుట్టూ ఉన్న ఊరిలో (శ్రీగిరి లింగానికి పానపట్టం) ఉండటం అంటే స్వయంగా అంబికా దేవి ఒడిలో పసి బిడ్డలా ఆడుకోవడమే. శ్రీశైల గ్రామంలో నివాసం ఉన్న రోజుల్లో మన శారీరకమైన,మానసికమైన ఎన్నో మలినాలను మనం విసర్జిస్తాము. రోజుల పసిబిడ్డ అమ్మ ఒడిలో ఉన్నప్పుడు శారీరక ధర్మం ప్రకారం మలినాలు విసర్జించడం లాంటిదే ఇది కూడా ! అయినా , శ్రీశైల తిరుమల పర్వతాల మీద అడుగు పెట్టబోయే ముందు పరమాత్మకి నమస్కారం చేసుకుని "తండ్రీ! ఈ యుగంలోని దుర్బలమైన మనుష్య ధర్మాన్ని అనుసరించి ఈ పవిత్రమైన పర్వతాన్ని అధిరోహించి నీ దర్శనార్థం కొంత సమయం ఉండబోతున్నాను, ఆ సమయంలో నా శరీర ధర్మ నిర్వహణ కోసం కొన్ని పనులు చేస్తాను. నన్ను క్షమించి నాకు దర్శనం ఇచ్చి నన్ను ఉద్ధరించు" అని ప్రార్థన చెయ్యాలి. 

దాదాపు గంటన్నర సేపు కొండల్లోనూ లోయల్లోనూ ప్రయాణించి, శ్రీశైలం ప్రాజెక్ట్ ఒక వైపు నుంచి రెండవ వైపుకి కృష్ణా నది మీద వంతెన దాటి వెళ్లి, పైకి పైకి ఎగబాకి చివరికి శ్రీశైల పర్వతాన్ని చేరుకుంటాం.



ఎదురుగా శ్రీశైల పర్వతం కనిపిస్తున్నట్టే ఉంటుంది. కాని గంటన్నర పైగా ఎత్తులు ఎక్కి పల్లాలు దిగి ప్రాణం విసిగిపోతూ ఉంటుంది. ఆ ప్రకృతి అతి అద్భుతం, మనిషి భౌతిక విజ్ఞాన శాస్త్రం పరమ అద్భుతం. ప్రతి మలుపు లోనూ ఒక గుడి లేదా ప్రార్థనా మందిరం. కొంత మంది కారణ జన్ముల, యోగుల ఆశ్రమాలు అక్కడక్కడా కనిపిస్తాయి. కొన్ని పరిశోధనా కేంద్రాలు నెలకొలిపి ఉన్నాయి. ఆ క్షణానికి ఇవి అన్నీ చూసి కొంత మనసు మురిసిపోయినా మల్లికార్జున స్వామి, అమ్మ భ్రమరాంబ దర్శనం ఇంకా ఎంత సేపటికి అవుతుంది అని ప్రాణం విసిగిపోతుంది. "ఇది కేవలం మన ఊరి నుంచి శ్రీశైలం వరకు చేసే ప్రయాణం కాదేమో, బహుశా ఆ పరమాత్మని చేరేందుకు మన ఆత్మ పడే తపనకి సూక్ష్మ రూపమేమో ?" అని మనసుకి తోచింది.


Saturday, July 6, 2013

ధర్మ యజ్ఞంలో - సమిధలు

  కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో, కొన్ని జీవితాలు అంతు లేని దుఖాన్ని మాత్రమే చవి చూస్తూ ఎందుకు ఉంటాయో సామాన్య మానవుని ఆలోచనకి, విచక్షణకి అందదు.

భగవంతుడి సృష్టిలో ప్రతి ప్రాణికీ ఒక లక్ష్యం ఉంటుంది, ప్రతి జీవితానికీ ఒక గమ్యం ఉంటుంది. అతి కొద్ది మంది యోగులకి, జ్ఞానులకి మాత్రమే భగవంతుడి సృష్టిలో లీలలు అర్థం అవుతాయి.

శ్రీమద్రామాయణంలో రాముల వారు వనవాసానికి బయలుదేరినప్పుడు సీతా అమ్మవారు భర్తని అనుగమించారు. సాక్షాత్ శ్రీ మహా లక్ష్మి అమ్మవారు మానవ స్త్రీగా ఎన్నో కష్టాలు అనుభవించారు, భయానక సందర్భాలు ఎదుర్కొన్నారు, కృంగదీసే అవమానాలు భరించారు. అటువంటి మరొక పరమ సాధ్వీమణి ఊర్మిళ. భర్త లక్ష్మణుడు తన అన్నగారికి  తోడుగా వనవాసానికి వెళ్తుంటే, దుఃఖాన్ని దిగమింగి పంపారు. పదునాలుగు ఏండ్ల పాటు తీవ్రమైన ఒంటరితనాన్ని అనుభవిస్తూ నిద్రలో తన మొత్తం దుఃఖాన్ని దిగమింగుకున్నారు. రామావతార స్వీకారం ద్వారా భగవంతుడు చేయదలుచుకున్న ధర్మ సంస్థాపనలో తన వంతు కర్తవ్యమ్ తల్లి ఊర్మిళ ఇలా నెరవేర్చారు.

వేంకటనాథుడు రాఘవేంద్రస్వామి గా మారక మునుపు ఆయన ఒక గృహస్థు. భార్య బిడ్డడితో అతి దారుణమైన దారిద్ర్యాన్ని అనుభవించారు. ఆయన భార్య సరస్వతమ్మ భర్తని అనుగమించిన మహా ఇల్లాలు. కట్టు బట్టలు కూడా సరి అయినవి లేనంత కటిక దారిద్ర్యాన్ని భర్త సాన్నిధ్యమనే వెలుగులో అధిగమిస్తూ జీవనం సాగించారు. తరువాత రోజుల్లో వేంకటనాథుడు గురువు గారి ఆజ్ఞకి తలొగ్గి హఠాత్తుగా సన్యాసం, శ్రీ మఠం బాధ్యతలు స్వీకరించినప్పుడు సరస్వతమ్మ గారు ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. భర్త తోడే లోకం గా బ్రతుకుతూ అతి భయంకరమైన పరిస్థితులు భరించిన మహా ఇల్లాలు, భర్త పక్కన లేని జీవితాన్ని ఊహించుకోలేక ఈ లోకాన్ని వదిలిపెట్టారు. ఆ సమయంలో దుఃఖంతో మరణించిన ఆమె ఆత్మ శాంతి లేక అలమటిస్తూ ఉంటే రాఘవేంద్ర స్వామి ఆమెకి సద్గతులు కలిగించారు. లోక కళ్యాణానికి తన భర్తని త్యాగం చేసిన ఆ సాధ్వి, తన త్యాగానికి ఫలంగా పరమపదం చేరారు.

లోకంలో పరమేశ్వరుడు ధర్మ సంస్థాపన చెయ్యడానికి, దీనులని ఉద్ధరించడానికి యుగాన్ని బట్టి, కాలాన్ని బట్టి అనేక అవతారాలు స్వీకరించాడు, అలాగే గురు పరంపరని నెలకొల్పాడు. మహా విష్ణువు దశావతారాలు మొదలుకొని ఆది శంకరాచార్యులు, షిరిడి సాయిబాబా, మీరాబాయి, శ్రీపాద వల్లభ స్వామి, శృంగేరి గురు పరంపర, కంచి గురు పరంపర, నృసింహ తీర్థ స్వామి, సత్య సాయిబాబా, రమణ మహర్షి, రాఘవేంద్ర స్వామి, శ్రీల ప్రభుపాదులు, అమృతానందమయి అమ్మ - అఖండ భారతావనిలో ఈ ధర్మోద్ధరణ కార్యాన్ని నిర్వహించడానికి ఎందరో కారణజన్ములు వచ్చారు.

ఒక ధర్మోద్ధరణ కార్యం ఒకరి వల్ల జరుగుతోంది అంటే, భగవంతుడు వారి ద్వారా తన లీలను ప్రకటితం చేశాడు అని అర్థం. అలా తన లీలని ప్రకటితం చెయ్యడానికి ఆయన ఒకరిని ఎంచుకోవాలంటే వారు అనంతమైన పుణ్యం చేసి ఉండాలి. ఆ పుణ్యం వారు ఒక్కరిదే కాదు - ఆ ఎంచుకోబడిన వారి జీవితంలో అనేక సందర్భాల్లో తోడుగా నిలిచిన వారు, గురువులు, వారి పూర్వీకులు, కన్నవారు, తోడ బుట్టినవారు, జీవిత భాగస్వామి, బిడ్డలు - ఇంకా అనేక మంచి చెడులకు ప్రత్యక్షంగా పరోక్షంగా దోహదం చేసినవారు - ఇలా ఎంతో మంది పుణ్యఫలాలు కలిసి - ఆ వ్యక్తి  ద్వారా ప్రకటితం అయ్యి ఉంటాయి.

ప్రతి యుగంలోనూ ఎన్నో ధర్మ యజ్ఞాలు, యజ్ఞ కర్త భగవంతుడు, యాగాగ్నిగా ఎందరో సత్పురుషులు. యాగాగ్నులని నిలిపి ఉంచేవి ఎన్నో సమిధలు. ఈ సమిధలు - అనంతమైన దుఃఖాన్ని భరించి, 'భగవంతుడు వీరికి ఎందుకు ఇటువంటి భయంకరమైన దుఃఖాన్ని రాసి పెట్టి ఉంటాడు' అని అందరూ మధన పడేంత స్థితిలో ఉంటూ, జవాబు లేని ప్రశ్నలా మనకి కనిపిస్తారు. లౌకికమైన భావనలో వారి  జీవితానికి న్యాయం జరిగినట్టు మనకి అనిపించదు.

నవీన కాలంలో కూడా ఇలాంటి దృష్టాంతాలు మనకి కొన్ని కనిపిస్తున్నాయి -
జీవితంలో ఎన్నో కలలతో ముందుకు అడుగేస్తున్న ఒక బంగారుతల్లి 'నిర్భయ' , ఆరుగురు రాక్షసుల కర్కశత్వానికి అతి దారుణంగా బలి అయ్యింది. తనమీద జరుగుతున్న అన్యాయాన్ని శాయశక్తులా ఎదిరించింది, మృత్యువు అతి దారుణంగా కబళిస్తున్న సమయంలో కూడా ఎదిరించి నిలబడింది. అఖండ భారతావని ప్రజల్లో ఒక ధర్మాగ్రహాన్ని రగిలించి, దేశంలో స్త్రీల రక్షణ కోసం ప్రతి ఒక్కరినీ ఉద్యమించేలా చేసి, తను జీవిత రంగం నుంచి నిష్క్రమించింది. తమ ఆడ బిడ్డలని రక్షించుకోవాలనే విచక్షణని ప్రజలకి కల్పించి ఆసేతు హిమాచల పర్యంతం స్ఫూర్తిని, జాగృతిని వెలిగించిన మహా శక్తి ఆ తల్లి. ఆమెకి జరిగింది గుండె వెయ్యి వక్కలు అయ్యేంత భయంకరమైన అన్యాయమే! కానీ కోటాను కోట్ల ప్రజలను స్త్రీజన రక్షణ కోసం
కరడు కట్టిన జడత్వం నుంచి ధర్మాగ్రహం వైపు నడిపించే యజ్ఞంలో ఆ బంగారుతల్లి సమిధ అయ్యిందేమో ? 

వేలాది మంది చార్ ధామ్ యాత్ర పేరుతో పరమేశ్వరుడి సమక్షంలో తరించాలని ఆశపడి, ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చి దేవభూమి అయిన ఉత్తరాఖండ్ కి తరలి వచ్చారు. చూస్తూ చూస్తూ ఉండగానే గంగమ్మ మహోగ్రహ తరంగాలలో జల సమాధి అయ్యారు. నీటిలో కొట్టుకొని పోయిన వారు కొందరు, బురదలో కూరుకుని  ప్రాణాలు విడిచిన వారు కొందరు, కొండల మీద నుంచి దొర్లిన బండ రాళ్ళ కింద చితికి మరణించిన వారు కొందరు, ఆప్తులని కోల్పోయిన వారు కొందరు, అడవులలో అలమటించిన వారు కొందరు, దారుణమైన రీతిలో అంగ వైకల్యం బారిన పడ్డ వారు కొందరు, విష కీటకాల - క్రూర మృగాల భయానక దాడులని తప్పించుకుని గుండెలు అవిసిపోయిన వారు కొందరు, ప్రాణాలు పోయే స్థితిలో కుడా మనిషి మితి మీరిన స్వార్థానికి నివ్వెరపోయిన వారు కొందరు - ఇంత భయంకరమైన జల విలయం ఎందుకు వచ్చింది ? సామాన్య జనులకి తీర్థ యాత్ర ఒక ప్రాణాంతక అనుభవంగా ఎందుకు మారింది ? ప్రభుత్వం కాసుల కోసం ప్రాకృతిక స్వరూపాలని జల విద్యుత్ కేంద్రాల కోసం నామ రూపాల్లేకుండా చేసింది, అది చాలా పెద్ద తప్పు. శివ శక్తుల సహజ సంతులిత శక్తి తత్త్వం తో సుసంపన్నమైన పుణ్య క్షేత్రాలని - చార్ ధామ్ రక్షకురాలైన శక్తి ధారీ దేవిని - అభివృద్ధి పేరుతో సహజ స్థితి నుంచి పక్కకి తప్పించింది, ఇది మహా అపరాధం. అభివృద్ధి పేరిట భారత దేశంలోని దేవ భూమిలో ఈ మహాపరాథాలు జరగడం చూడలేక భూమాత, గంగమ్మ కన్నెర్ర చేశారు. భగవంతుడు చేస్తున్న ధర్మ యజ్ఞంలో ఈ సామాన్యులు ఏ విధమైన పాత్రని నిర్వహించడానికి ఇంత దుఃఖం పొందాల్సి వచ్చిందో ?

ఇది అంతా నా లాంటి సామాన్య మనిషికి అర్థం అయ్యే రీతిలో పరమేశ్వరుని లీలని / భావాన్ని తెలియజేయగల మహానుభావులు ఎవరన్నా తారసపడాలని కనులు కాయలు కాసేలా చూస్తున్నాను. "తీర్థయాత్ర కి వచ్చి మేము ఎన్ని కష్టాలు పడ్డామో" అని దుఃఖంలో వేదన చెందుతున్న ప్రజలకి ఈశ్వరుడి సంకల్పాన్ని / లీలని ప్రకటితం చెయ్యగల వారు ఒకరు రావాలి. హిందూ ధర్మం విస్తృతం అయినది, గంభీరమైనది, అద్భుతమైనది. ఎప్పుడూ సుఖం మాత్రమే ఆశించాలి అని హిందూ ధర్మం బోధించలేదు. సుఖమ్ దుఃఖం రెండిటినీ సమానంగా తీసుకోగల దీరోదాత్తతని హిందూ ధర్మం నేర్పుతుంది. అయితే జ్ఞానం పెద్దగా వికసించని వాళ్ళని - ఇటువంటి సంఘటనలను ఉదాహరణగా చూపించి - పర ధర్మం లోకి వారిని మరల్చగల ప్రలోభపెట్టే శక్తుల ప్రభావం నేడు బలంగా ఉంటోంది. అటువంటి వారి నుంచి అమాయకుల నమ్మకాన్ని రక్షించడానికి నా స్వామి తన దూతని మా మధ్యకి పంపాలి.

తండ్రీ  ! నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాము, తల్లి ప్రకృతి మాకు ఇచ్చిన జీవనాన్ని మా చేతులతో నాశనం చేసుకున్నాం. మా తోటి జీవులకి మనుగడ  లేకుండా చేశాము. నువ్వు బ్రతకమన్న రీతిలో బ్రతకకుండా వెర్రి తలలు వేశాము. మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించి కడుపులో పెట్టుకు కాపాడు. నీ పరిపూర్ణ సృష్టి నియమాలను గౌరవిస్తూ, నీ మంగళ కర తత్త్వాన్ని అవగతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే వరాన్ని అనుగ్రహించు, మమ్మల్ని కనికరించు !


Tuesday, May 21, 2013

నారాయణుడు - నారాయణి

పరమాత్మ పురుష రూపంలో ఉంటే నారాయణుడు, స్త్రీ రూపం లో సాక్షాత్కరిస్తే నారాయణి (పార్వతీ అమ్మవారు).

- కాంచీపురంలో అమ్మ కాత్యాయని పరమ శివుడి కోసం తపస్సు చేసి, ఈశ్వరుడి పరీక్షని ఉద్ధృత గంగ రూపంలో ఎదుర్కొంటున్నప్పుడు - విష్ణు మూర్తి చెల్లెలికి అండగా నిలబడి, ఆ పరీక్షని చాకచక్యంగా ఎదుర్కొనేలా చేసి - కామాక్షీ ఏకామ్రనాథుల కళ్యాణానికి మార్గం సుగమం చేశాడు.

- మథురైలో మీనాక్షీ సుందరేశ్వరుల కళ్యాణానికి కూడా కర్త నారాయణుడే !

అన్నగారు ఎక్కడెక్కడ వెలిసినా అక్కడ తన స్పర్శని తెలియజేసే తల్లి పార్వతీ అమ్మవారు.

- శ్రీ కృష్ణావతారంలో యశోదా దేవి కడుపున యోగ మాయగా జన్మించి, బాల కృష్ణుడు రేపల్లెకి రాగా తాను దేవకీ దేవి ఒడి చేరి, కంసుడిని హెచ్చరించి, కృష్ణావతార ప్రయోజన ఘట్టాలకు తెర తీసింది సాక్షాత్ పార్వతీ అమ్మవారే !

- శ్రీ కృష్ణుడు అంబికా దేవి ఉపాసకుడు. ఆయన భాగవతంలో చూపిన ప్రతి లీల వెనుక యోగమాయ పార్వతీ దేవి మహాత్మ్యం ఉంది.

- దుర్మార్గులైన రాజులని వధించి భూభారాన్ని తగ్గించడానికి మహా విష్ణువు పరశురామావతారం ఎత్తినప్పుడు, ఆయన జననీ జనకులు అయిన జమదగ్ని మహర్షి, రేణుకా మాత - సాక్షాత్ పరమ శివుడు, పార్వతీ దేవి అంశలే !

ఆ అపురూప బంధం యొక్క దృష్టాంతాలు ఇప్పటికీ మనం కొన్ని క్షేత్రాలలో చూడచ్చు.

- సింహాచల క్షేత్రంలో కొండ కింద పార్వతీ అమ్మవారు పైడిమాంబ రూపం లో కొలువై ఉంది. నరసింహ స్వామి చెల్లెలుగా కొన్ని ఉత్సవాలలో పైడి తల్లి అమ్మవారికి స్వామి నుంచి సారె వస్తుంది. అన్నగారికి లక్ష్మీ దేవిని ఇచ్చి వివాహం చేయించడానికి పైడితల్లి అమ్మవారు, సోదరి సత్తెమ్మ తల్లితో, తమ్ముడు పోతురాజుతో కలిసి పెళ్ళి వ్యవహారానికి వెళ్ళారని సింహాచల భక్తుల నమ్మకం.

- అన్నవరం సత్యన్నారాయణ స్వామిగా మహా విష్ణువు వెలసిన పుణ్య క్షేత్రంలో, వన దుర్గా దేవిగా స్వామి వారి క్షేత్రాన్ని పాలిస్తూ స్వామి సోదరిగా పూజ అందుకుంటున్నారు పార్వతీమాత. 

Sunday, May 5, 2013

హిమజ

తండ్రికి కూతురు బంగారు తల్లి, వరాల మూట.

కూతురు పుట్టిన తర్వాత తండ్రి వ్యక్తిత్వం సమూలంగా మారిపోతుంది. యవ్వనంలో ఉండే ఆగ్రహం,ఆవేశం స్థానంలో విచక్షణ, మెళకువ వస్తాయి. కూతురు ఎదుగుతున్న కొద్దీ తండ్రి ఒక్కొక్క పార్శ్వంలో తనను తను దిద్దుకుంటూ పరిపూర్ణమైన వ్యక్తిగా తనని తాను ఆవిష్కరించుకుంటాడు. తండ్రికి సాక్షాత్తు ఇంకొక జన్మ వంటి పరిపూర్ణ అస్తిత్వాన్ని ఇచ్చేది కూతురు.

సాక్షాత్తు జగన్మాత ని కూతురిగా పొందిన హిమవంతుడి అదృష్టాన్ని ఏమని పొగడగలం ?

తన సంకల్ప మాత్రంతోనే లోకాలన్నిటినీ సృజించగల పరమ శక్తి స్వరూపిణి పసి బిడ్డలా మారి హిమవంతుడి చేతుల్లో బంగారు బొమ్మలా కేరింతలు కొట్టింది. సమస్త ప్రాణి కోటికి అన్నాన్ని ఇచ్చి పోషించి లోకాన్ని నడిపే తల్లి హిమవంతుడి చేతి గోరుముద్దలు తిన్నది. సర్వ లోకులనూ పసి బిడ్డలని చేసి ఆడించే అమ్మ, హిమవంతుడి ఒడిలో పసి బిడ్డ రూపంలో ఆడింది. అనంత సూర్య కోటి ప్రభా సమానమైన వెలుగులని చిందించే అమ్మవారు, హిమవంతుడి కనుల వెలుగుగా ఎదిగింది.

అమ్మవారిని పరమ శివుడికి కన్యా దానం చేసే మధుర క్షణంలో, హిమవంతుడి మనసు ఎంత ఉప్పొంగి ఉంటుందో ? సర్వ లోకాల ఏలిక అయిన పరమ శివుడికే పార్వతి అమ్మవారిని కన్యాదానం చెయ్యగలిగిన తన భాగ్యానికి ఎంత ఉద్వేగాన్ని అనుభవించి ఉంటాడో ? ఎవరిని మించి అధికుడు అనేవాడు విశ్వంలోనే లేడో, అటువంటి పురుషోత్తముడి మామగారిగా తనని పుట్టిన్చినందుకు అమ్మవారిని ఎన్ని రకాలుగా ధ్యానించి ఉంటాడో ?

పార్వతి, హిమజ, హైమవతి - అని తన కుమార్తెగా నామము ధరించి, తనని శాశ్వతంగా  ప్రసిద్ధం చేసి, తన జన్మని ధన్యం చేసిన అమ్మవారి కరుణా రస సాగరంలో మునిగిన హిమవంతుడు ఏమి భావించి ఉంటాడు ? ఆ భావం యొక్క ఉన్నతిని వర్ణించడానికి భాష సరిపోదు.

అందరు లౌకిక మానవుల లాగే ఒక్క మాట మాత్రం అనుకుని ఉంటాడు - "ఈమె నా కడుపున పుట్టిన కుమార్తె కాదు, ఈమె సాక్షాత్తు నను కన్నతల్లి. నాకు మళ్లీ నడకలు నేర్పించి నన్ను సాకడానికి వచ్చిన నా బంగారు తల్లి" అని.