తన వాళ్ళు ఒకరు కూడా లేక, సానుభూతి గా చల్లగా పలకరించే దిక్కు లేక, తను బ్రతికి ఉన్నదో లేదో కనుక్కునే అవకాశం కూడా తన వాళ్లకి లేక, కను చూపు మేరలో ఆశ అన్నది లేక, అతి భీకరంగా కనిపిస్తూ తనని మాటలతో వేధిస్తున్న రావణుడు అతని అనుచరుల మధ్య అతి దైన్యంగా జీవితం వెళ్లబుచ్చుతున్న సీతా మాత ఆత్మహత్య చేసుకోవాలనే తలపు ఒక క్షణం కలుగగా, తిరిగి గుండె చిక్కబట్టుకుని ఆశ కూడదీసుకుంది.
సుందరకాండలో సీతమ్మ తన స్వగతంలో అనుకున్న మాట ఇది (ఈ కాలపు కాలమానం ప్రకారం చెప్పాలంటే) - "ఈ సృష్టిలో ఏ ఒక్క వ్యక్తికీ సదా దుఃఖం మాత్రమే ఉండదు. కలత తీరే రోజు తప్పకుండా వస్తుంది. ఒక వ్యక్తి తన జీవితంలో తొంభై తొమ్మిది సంవత్సరాల పదకొండు నెలల ముప్ఫై రోజుల ఇరవై మూడు గంటల యాభై తొమ్మిది నిముషాల పాటు అనూహ్యమైన తీవ్రమైన దుఃఖం పొందినా - ఆ మిగిలిన ఒక్క నిముషంలో అయినా ఖచ్చితంగా గొప్ప ఆనందాన్ని పొంది తీరుతాడు."
కష్టాన్ని దుఃఖాన్ని నిరాశని భరించడం చాలా చాలా కష్టం. కానీ ఆత్మహత్య ఎట్టి పరిస్థితిలోను శరణ్యం కాదు. లోపల ప్రాణ జ్యోతి తనే ఆరిపోయేవరకు మనం బ్రతకాల్సిందే.
నటుడు ఉదయ కిరణ్ ఆత్మహత్య బాధాకరం - అతను నటుడు అయినందుకు కాదు - ఒక యువకుడు జీవితంలో ఎత్తు పల్లాలు తట్టుకోలేక మరణాన్ని ఆశ్రయించడం బాధాకరం.
అతను మాత్రమే కాదు, అతనిలా రక రకాల కారణాలతో ఆత్మహత్య వైపు అడుగులు వేసే సున్నిత మనస్కులకి అందరికీ 'సుందరకాండ' సందేశం అందాలి.
ఆకాలంగా మరణాన్ని ఆశ్రయించిన ఆ ప్రాణాలు పరమాత్మని చేరుగాక !
No comments:
Post a Comment